ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అరెస్ట్

ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అరెస్ట్

ఆర్​జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటుగా మరో ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ మేరకు ఘోష్​ను సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం నుంచి సీబీఐ అవినీతి నిరోధక విభాగానికి తరలించింది. ఘోష్ హయాంలో ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తునకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్‌లో ఘోష్ పేరును చేర్చిన కొద్ది రోజులకే ఈ అరెస్టు జరగడం గమనార్హం.

ఈ నేపథ్యంలో 15వ రోజు విచారించిన సీబీఐ అరెస్టు ఆయన్ను చేసింది. ఘోష్‌ను అరెస్టు చేసిన ఒక గంటలోపే, సీబీఐ అధికారులు ఆయన సెక్యూరిటీ గార్డుతో పాటు ఆస్పత్రికి సామాగ్రి సరఫరా చేసే ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేశారు.  సందీప్ ఘోష్ 2021 ఫిబ్రవరి నుంచి 2023 సెప్టెంబరు వరకు ఆర్​జీ కర్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.

అయితే, 2023లో బదిలీ అయినా, నెలలోపే తిరిగి ఆ స్థానంలోకి వచ్చారు. వైద్య విద్యార్థి హత్యాచారానికి గురైన రోజు వరకు ఆయన ఆసుపత్రి ప్రిన్సిపల్​గా ఉన్నారు.  కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు నమోదైన ఎఫ్ఐఆర్‌లో సందీప్ ఘోష్‌తోపాటు మూడు ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. దీంతో సీబీఐ అవినీతి నిరోధక విభాగం ఉన్న నిజాం ప్యాలెస్ కార్యాలయానికి అతడిని తరలించారు. అక్కడ ఆర్థిక అవకతవకలపై విచారణ జరిగింది.

ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. క్లెయిమ్ చేయని మృతదేహాలను విక్రయించడం, బయోమెడికల్ వ్యర్థాలు అక్రమ రవాణా, పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకోవడంలాంటి అనేక ఆరోపణలు అతడిపై ఉండటంతో హైకోర్టు విచారణ చేయాలని ఆదేశించింది. అవినీతి కేసులకు సంబంధించి కోల్‌కతాలోని ఘోష్ నివాసంలో ఆగస్టు 25న సీబీఐ ఒకరోజు సోదాలు నిర్వహించారు.

మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మాజీ ప్రిన్సిపాల్, మరికొందరి హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇటీవల సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. తాజాగా ఈ కేసులో మాజీ ప్రిన్సిపాల్ అరెస్టు అయ్యారు.

వైద్యురాలి హత్యాచారంలో ఆస్పత్రి సిబ్బంది ప్రమేయంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఆర్​జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ డిప్యూటీ సుపరింటెండెంట్‌ అక్తర్‌ అలీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణకు ఆదేశించింది. దీంతో బంగాల్ ప్రభుత్వం ఆగస్టు 23న సిట్​ను ఏర్పాటు చేసింది. 

ఈ విచారణపై పలు అనుమానాలు వ్యక్తం అవ్వడం వల్ల సిట్ విచారణను హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది.  అక్తర్‌ అలీ సిట్ విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. 2023 జులై 14న అలీ రాసిన లేఖ ప్రకారం, ఆస్పత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్‌ లేదా స్వాస్త్‌ భవన్‌ అనుమతులు లేకుండానే ఘోష్‌ లీజుకు ఇచ్చారు. 

ఇక ఆస్పత్రికి అవసరమైన పరికరాలు, ఔషధాల సరఫరాదారుల ఎంపికలో బంధుప్రీతి చూపించారు. కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకు ఇచ్చారు. ఇక సరఫరాదారుల నుంచి 20 శాతం ఘోష్​ కమిషన్‌ తీసుకునేవారు. 

అనాథ శవాలు, వినియోగించిన సిరంజ్‌లు, సెలైన్‌ బాటిల్స్‌, రబ్బర్‌ గ్లౌజులు వంటివి ఆస్పత్రికి ప్రతి రెండు రోజులకు 500-600 కిలోలు వరకు పోగయ్యేవి. వాటిని ఇద్దరు బంగ్లాదేశీయుల సాయంతో ఘోష్‌ రీసైక్లింగ్‌ చేయించేవారని ఆరోపిస్తూ అలీ అప్పట్లోనే విజిలెన్స్‌ కమిషన్‌, ఏసీబీ, హెల్త్‌ డిపార్ట్‌మెంట్లకు ఫిర్యాదు చేశాడు.