వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగి ముగ్గురు మృతి 

వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగి ముగ్గురు మృతి 
జమ్మూ కశ్మీర్‌లో. శ్రీమాతా వైష్ణో దేవి ఆలయ సమీపంలోని పంచి హెలిప్యాడ్ రోడ్డు మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు మరణించారు. మరికొంత మంది భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న వెంటనే మాతా వైష్ణో దేవి మందిరం బోర్డు రెస్క్యూ సిబ్బంది రిలీఫ్ పనులను ప్రారంభించింది. 
 
రెండు రోజులుగా వైష్ణో దేవి ఆలయ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే కొండచరియలు విరిగిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షంతో కొండచరియలు విరిగిపడగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వైష్ణో దేవి హిమకోటి పర్వతంపై పంచి హెలిప్యాడ్ సమీపంలో ఈ కొండచరియలు విరిగిపడ్డాయి. హెలికాప్టర్ ల్యాండ్ అయిన కొద్ది సెకన్లకే కొండచరియలు విరిగిపడటంతో హెలికాప్టర్ సేవలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడటంతో ఫుట్‌పాత్‌పై నిర్మించిన టిన్‌షెడ్ విరిగిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. 

రియాసి జిల్లా కమీషనర్ మరణాలను ధృవీకరించారు. కొండచరియలు విరిగిపడటంతో హిమకోటి రహదారిపై పెద్ద ఎత్తున శిథిలాలు వచ్చి పడ్డాయి. అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రతికూల వాతావరణం కారణంగా రెస్క్యూ పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు సమాచారం. అయితే వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హిమ్‌కోటి పర్వతంలో క్షతగాత్రులను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిలో ఓ బాలిక కూడా ఉన్నట్లు సమాచారం. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురి నుంచి నలుగురు గాయపడ్డారు. హిమకోటి మార్గంలో ప్రయాణాన్ని ప్రస్తుతానికి నిలిపివేశారు. బ్యాటరీ కార్ సర్వీస్ కూడా నిలిపివేయబడింది. అయితే ప్రజల్లో భయాందోళనలు కలగకుండా ఉండేందుకు పాత సంప్రదాయ మార్గంలోనే యాత్రను ప్రారంభించారు.

జమ్మూ కశ్మీర్‌లో సెప్టెంబర్ 12 వరకు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ఆదివారం అంచనా వేసింది. అయితే కేంద్ర పాలిత ప్రాంతంలో మరికొన్ని చోట్ల కొద్దిపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమవారం తెల్లవారుజామున భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో చాలా చోట్ల బద్రీనాథ్ వెళ్లే జాతీయ రహదారిని బ్లాక్ చేశారు.

 పగల్నాల, పాతాళగంగ, నందప్రయాగ్ వద్ద హైవే ప్రాంతాల్లో కూడా రహదారులను మూసి వేశారు. సిమ్లీ బజార్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఏడు దుకాణాలు దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు.