తగ్గుముఖం పట్టిన కృష్ణా వరద ఉధృతి… బుడమేరు నీటి ప్రవాహం

తగ్గుముఖం పట్టిన కృష్ణా వరద ఉధృతి… బుడమేరు నీటి ప్రవాహం
చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో కృష్ణానదికి వరద పోటెత్తడంతో నదీతీర ప్రాంతాల్లో ఏర్పడిన ఆందోళనకర పరిస్థితులు క్రమంగా దారిలోకి వస్తున్నాయి.  రెండురోజులుగా వణికిస్తున్న వరద ఉధృతికి సుమారు 2.70 లక్షల మంది ముంపుబారిన పడగా, సోమవారం నాటికి 70 వేల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. మరో రెండు లక్షల మంది ఇంకా ముంపులోనే ఉన్నారు.
 
అయితే, ఒక వంక కృష్ణా నదిలో వరద నీటి ఉద్రితి తగ్గుముఖం పట్టడం, మరోవంక బుడమేరులో నీటి ప్రవాహం తగ్గుతూ ఉండడంతో అధికార యంత్రాంగం ఉపశమనం పొందుతుంది.  బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలకు సోమవారం విజయవాడ ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయి వరదనీరు చేరింది. ఎన్నడూ లేనంతగా 11.47లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, మంగళవారం వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. పైనుంచి నీటి ఉద్ధృతి తగ్గడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 9.79లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.
 
చరిత్రలో ఇదే రికార్డుస్థాయి నీటిమట్టం అని, అయినా ప్రకాశం బ్యారేజ్ తట్టుకుని నిలబడినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నానికి నీటిమట్టం మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే నీటిమట్టం తగ్గడంతో విజయవాడ రామలింగేశ్వర నగర్‌లో వాటర్ వెనక్కి వెళ్లుతున్నాయి. వరదనీటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుండడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
 
మరోవైపు ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల స్వల్పంగా తగ్గటంతో అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం నాగాయలంక, శ్రీరామపాద క్షేత్రం ఘాట్ వద్ద అడుగు మేర వరద నీటిమట్టం తగ్గింది. కరకట్టకు సమాంతరంగా నీరు ప్రవహించడంతో నదీ తీర గ్రామాల ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.  అయితే అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక మండలాల్లోని లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో వారంతా భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
 
మరోవంక, ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి. కొండూరు మండలంలోని బుడమేరు కాస్త శాంతించింది. నిన్నటి వరకూ మహోగ్రరూపం చూపించిన బుడమేరుకు ఇవాళ వరద ఉధృతి కాస్త తగ్గింది. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15 వేల క్యూసెక్కులకు మించి వరద నీరు వచ్చి చేరింది. కుంభవృష్టి నమోదు కావడంతో బుడమేరు మహాగ్రరూపం దాల్చింది. 
 
ఫలితంగా విజయవాడలోని 16 డివిజన్లను వరద ముంచెత్తింది. 48 గంటలుగా సుమారు 2 .59 లక్షల మంది ప్రజానీకం వరద నీటిలోనే ఉండిపోయింది. చివరి వరకూ వారికి ప్రభుత్వ సహాయక చర్యలు అందలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  స్వయంగా మకాం వేసినా కూడా చివరి వరకు సహాయం చేరలేదు. బుడమేరులో ప్రస్తుతం, 6 వేల క్యూసెక్కులు మాత్రమే వరద ప్రవాహం ఉంది. ఇది మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
 
మరోవైపు వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో బలహీన పడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో, ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 5న పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు.