
సినిమా విడుదలలో జాప్యంపై స్పందిస్తూ ‘ఇప్పుడు నా సినిమాపై ఎమర్జెన్సీ విధించారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. మన దేశం పట్ల నేను చాలా నిరాశకు గురయ్యాను’ అని ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ విచారం వ్యక్తం చేశారు. ఆమె స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’.
ఈ నెల 6న విడుదల కావాల్సి ఉండగా, సినిమాలో సెన్సిటివ్ కంటెంట్ ఉందని అంటూ సిబిఎఫ్‌సి విడుదలకు అభ్యంతరం తెలిపింది. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ నిలిపివేయడానికి కారణాలు తెలియజేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వివరించింది. సినిమాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదని బోర్డు సూచించింది.
ఈ చిత్రం గతేడాది నవంబరు 24న విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాల వలన విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత కూడా ఈ సినిమా థియేటర్స్ వద్దకు వెళ్లలేదు. పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. చివరికి ఈ నెల 6న విడుదల చేయనున్నట్లు కంగన ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలలో జాప్యంపై కంగన తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
అయితే, తన చిత్రానికి సెన్సార్‌బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోతే తాను కోర్టులో పోరాడటానికైనా సిద్ధమేనని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ఎంతో ఆత్మాభిమానంతో తాను ఈ చిత్రాన్ని నిర్మించానని, ఈ విషయంలో సెన్సార్ బోర్డు తనను ప్రశ్నించలేదని ఆమె చెప్పారు.
భారతదేశ సమగ్రత, ఐక్యత చుట్టూ తిరిగే చిత్రాలను తీసేందుకు తమకు అనుమతి ఉండదని ఈ సందర్భంగా నటి వ్యాఖ్యానించారు. కొన్ని చిత్రాలు తీయడానికి కొంతమందికి మాత్రమే సెన్సార్‌షిప్ ఉంటుందని అంటూ ఇది చాలా అన్యాయమని కంగన పేర్కొన్నారు. తాను ఆత్మగౌరవంతో ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు.
సిక్కుల మతస్థుల మనోభావాలు దెబ్బతీలా ఈ సినిమా తీశారని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ ఆరోపిస్తోంది. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ సిబిఎఫ్‌సి, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు సినిమా విడుదలను ఆపాలని లేఖలు పంపింది. సినిమా ప్రదర్శనపై నిషేధం విధించాలని కోరింది.
సినిమాలో కొన్ని సున్నితమైన అంశాలు ఉన్నాయని కొన్ని మత సంస్థలు ఆందోళనలు కూడా చేశాయి. ఆగస్టు 14న ఎమర్జెన్సీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై విమర్శలు, వివాదాలు వస్తున్నాయి. ట్రైలర్‌లో పంజాబ్ వేర్పాటువాద ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే పాత్రను తప్పుగా చిత్రీకరించారని ఆరోపణలు ఉన్నాయి.
అకాల్ తఖ్త్ సాహిబ్‌పై బాంబు దాడి, ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జెన్సీ టైంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను విస్మరిస్తూ.. కథను పూర్తిగా ఒకవైపు మాత్రమే చూపించారని కొన్ని వర్గాలు ఎమర్జెన్సీ సినిమాని వ్యతిరేకిస్తున్నాయి.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు