తెలుగు రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు

తెలుగు రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు
 
* చెక్‌పోస్ట్‌ వద్ద నిలిచిన వాహనాలు
 
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్న  క్రమంలో వాగులు వంకలు పొంగుతున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. తెలంగాణ – ఏపీ మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.  తెలంగాణ – ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కోదాడ నుంచి వరదనీరు దిగువకు ప్రవహిస్తుంది. నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 
 
ఇక ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. హైవేపై మోకాళ్ల లోతు వరద ఉండడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.  విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు రాకుండా పోలీస్ రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
 
 హైదరాబాద్ వైపు చిలకల్లు టోల్ ప్లాజా వద్ద, విజయవాడ వైపు కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలను నిలిపివేశారు. దీంతో హైవే పూర్తిగా స్తంభించిపోయింది. వరద ఉధృతి తగ్గే వరకు వాహనాలను హైవేపైకి అనుమతించబోమని నందిగామ ఆర్డీవో తెలిపారు.  ఇక నల్లబండగూడెం వద్ద పాలేరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోగా బస్సులోని 30 మంది ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. 
 
రహదారులపైకి నీరు చేరుకోవడంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. వరంగల్‌లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో ఇప్పటికే హైదరాబాద్ వైపు వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి. విజయవాడ-హైదరాబాద్ మధ్య తిరిగే ఆర్టీసీ బస్సుల దారి మళ్లించారు. విజయవాడ నుంచి గుంటూరు, పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్‌కు బస్సులు బయలుదేరుతున్నాయి.