తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ భరోసా

తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ భరోసా
భారీ వర్షాలు, వరదల కారణంగా ఇరు రాష్ట్రాల్లో పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలతో ఆదివారం రాత్రి మాట్లాడారు. తీవ్రమైన వాతావరణం వల్ల ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంలో సహాయం చేయడానికి కేంద్రం నుండి సాధ్యమయ్యే అన్ని సహాయాన్ని రెండు రాష్ట్రాలకు  అందిస్తామని ఈ సందర్భంగా ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు.
 
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి విడుదలైన ఒక ప్రకటన ప్రకారం, ప్రదాని మోదీ అధ్వాన్నమైన ప్రాంతాల్లోని పరిస్థితులు మరియు వరదల వల్ల జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరదల మధ్య అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణనష్టాన్ని సమర్థవంతంగా నిరోధించినందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. 
 
ప్రతికూల వాతావరణంలో అత్యవసర సేవలందించేందుకు హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.  వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం తీసుకుంటున్న సహాయక చర్యలపై ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వివరించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలకు ఆదేశాలిచ్చామని, రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించినట్లు ఈ సందర్భంగా ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుతో తెలిపారు. 
 
తక్షణమే ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి అవసరమైన సామాగ్రిని పంపేందుకు ఆదేశాలిచ్చామని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కేంద్ర సహాయంపై ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షం, వరదతో వాటిల్లిన నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలను సీఎం రేవంత్ వివరించారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధాని మోడీకి సీఎం రేవంత్ తెలిపారు. 
 
కాగా, హోమ్ మంత్రి అమిత్ షా కూడా ఆదివారం సాయంత్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. వరద పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అవసరమైన అన్ని సహాయాలను అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడానని చంద్రబాబు చెప్పారు. 10 ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు, 40 పవర్‌ బోట్లు, 10 హెలికాఫ్టర్లు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని హెలికాఫ్టర్‌ ద్వారా తీసుకొస్తామని చెప్పారు.
కాగా, 26 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలను రెండు రాష్ట్రాల్లో వరద సహాయక చర్యల కోసం మోహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఇప్పటికే 12 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. కాగా, మరో 14 బృందాలను పంపిస్తున్నారు. సహాయక చర్యల కోసం మరిన్ని బృందాలు, మెకానికల్ బోట్లను కూడా ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు.
 
ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలోని కొన్ని ప్రాంతాలు తీవ్ర వరదలకు గురవడంతో 2.7 లక్షల మంది ప్రభావానికి గురయ్యారు.  ఉబ్బెత్తున వాగులు, వరద నీరు ప్రవహించడంతో నగరంలో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది.  బుడమేరు వాగు కారణంగా విజయవాడలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా ఈ ప్రాంతమంతా నీటమునిగింది.
ఇది చాలా బాధాకరమని, రాబోయే గంటల్లో వరద నీరు పెరిగే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడ నుంచి వచ్చిన చిత్రాలలో ప్రజలు మెడలోతు వరకు వర్షపునీటిని ఎదుర్కొంటున్నట్లు చూపించారు. పలు వాహనాలు కూడా వరద నీటిలో మునిగిపోయాయి. ‘విజయవాడ విషాదం’గా పిలువబడే బుడమేరు వాగు నది భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాలలో వరదల పరిస్థితికి దారి తీస్తుంది.