విజయవాడకు ఓవైపు కృష్ణమ్మ.. మరోవైపు బుడమేరు ముప్పు!

విజయవాడకు ఓవైపు కృష్ణమ్మ.. మరోవైపు బుడమేరు ముప్పు!

విజయవాడ నగరానికి వరద ముప్పు ముంచుకొస్తుంది. రెండు వైపుల నుంచి వరద ఉధృతి పెరుగుతోంది. ఓవైపు కృష్ణమ్మ, మరోవైపు బుడమేరు వరదలతో విజయవాడ నగరం తల్లడిల్లుతోంది. ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్‌ఫ్లో నమోదవుతోంది.  చరిత్రలో తొలిసారిగా.. ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల 20 వేల క్యూసెక్కులకు వరద చేరుకుంది.

బ్యారేజి మొత్తం గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని విడుదల చేశారు. 12 లక్షల క్యూసెక్కుల వరద రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.  బ్యారేజీ నిర్మాణం తర్వాత ఈ స్థాయిలో వరద అని చెబుతున్నారు. మరోవైపు బుడమేరు దెబ్బకు విజయవాడ శివారు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 24 కాలనీలు, పలు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. 

ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తున్న నేపథ్యంలో పెను ప్రమాదం జరిగింది. బ్యారేజ్‌ 3,4 గేట్లను మూడు బోట్లు ఢీకొన్నాయి. 40 కి.మీ వేగంతో బ్యారేజ్‌ గేట్లను బోట్లు ఢీకొన్నట్టు తెలుస్తోంది.

బోట్లు ఢీకొనడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో అధికారులు అలెర్ట్ అయ్యారు. అటు శ్రీశైలం ప్రాజెక్ట్‌ గేట్లలో సాంకేతిక సమస్య వచ్చింది. 2, 3 గేట్ల ప్యానల్‌లో బ్రేక్‌ కాయిల్ కాలిపోయింది. వరద ఉధృతితో గేట్ల హైట్‌ పెంచుతుండగా ఈ ఘటన జరిగింది. బ్రేక్‌ కాయిల్స్ పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

బ్యారేజి చరిత్రలో తొలిసారిగా రికార్డ్ స్థాయిలో వరద వచ్చి చేరింది. 2009 అక్టోబర్‌లో 10 లక్షల 94 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. 1903వ సంవత్సరంలో 10 లక్షల 60 వేలు క్యూసెక్కుల వరద వచ్చి చేరుకుంది. బ్యారేజి దిగువ భాగాన అనేక గ్రామాలు నీట మునిగి పోయాయి.

బ్యారేజిపై రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పూర్తిగా పైకి ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎప్పుడు లేని విధంగా 23.6 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో అవుట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుకుంది. రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.

కాగా, విజయవాడకు పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు కేంద్రం బోట్స్‌ను పంపించింది. లుధీయానా నుంచి ఆర్మీ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో బొట్లతో విజయవాడ వరద ప్రాంతాల్లోకి వెళ్లాయి. సుమారు 100 మందితో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి.