
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తెల్లవారుజామున 4 గంటల వరకూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. కేవలం రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకుని తిరిగి రంగంలోకి దిగారు. ఆహారం, బోట్స్ ఎంతవరకు చేరుకున్నాయని సమీక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి పవర్ బోట్స్ విజయవాడ చేరుకుంటున్నాయి. సింగ్ నగర్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిపై, సహాయంపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు.
గత రాత్రి నేరుగా ఇంటింటికీ వెళ్లి బాధితులను ఆయన పరామర్శించారు. రాత్రి 10. 40 గంటల నుంచి ఈ రోజు తెల్లవారుజామున 4.19 గంటల వరకు వరద నీటిలోనే ముఖ్యమంత్రి ఉన్నారు. తొలుత విజయవాడ సింగ్ నగర్, ఆ తరువాత ఇబ్రహీంపట్నం, ములపాడులో పర్యటించిన చంద్రబాబు.. మళ్ళీ అక్కడి నుంచి నేరుగా విజయవాడ కృష్ణలంకకు చేరుకున్నారు.
బ్యారేజి వరద 11 లక్షలకు చేరుకోవడంతో అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. కలెక్టరేట్‌లో తెల్లవారుజామున రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకున్నారు. తన వెంట అధికారులు ఎవరూ రావద్దని, అందరూ వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా వరదలు సంభవించాయని చెప్పారు. అకాల వర్షాలు, పై నుంచి వస్తున్న వరద నీరు వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
1998లో ఈ తరహా వరద వచ్చిందని పేర్కొంటూఆ సమయంలో 9.24 లక్షల క్యూసెక్కులు వస్తే, ఇప్పుడు 9.70 లక్షల క్యూసెక్కులు వచ్చాయని వివరించారు. ఈ విపత్తును సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. బుడమేరు వాగు తెగడంతో 16 డివిజన్లు నీట మునిగాయని చెప్పారు. నీటిలో చిక్కుకున్న వారి కోసం ఆహారం తయారు చేయాలని అక్షయపాత్ర, హోటల్ యాజమాన్యాలను సంప్రదించామని తెలిపారు. విజయవాడలోని అన్ని కళ్యాణ మండపాలు, హోటళ్లు అందుబాటులో పెట్టామని, అవసరమైతే ఇంకా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సింగ్‌నగర్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రతి డివిజన్‌కు ఒక సీనియర్, సచివాలయానికి జూనియర్ ఐఎఎస్ అధికారులను నియమిస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలో 2,76,145 మంది ప్రజలు ఉన్నారని తెలిపారు. బాధితుల సహాయం కోసం కమాండ్ కంట్రోల్ నెంబర్లు 112, 107 ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులు రాకుండా చర్యలు చేపడతామని ప్రకటించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఉండి అవసరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు