ఏపీకి మరో తుఫాన్ ముప్పు!

ఏపీకి మరో తుఫాన్ ముప్పు!
వాయుగుండం ప్రభావంతో మూడు రోజుల వర్షానికే ఏపీలో జనజీవనం స్తంభించింది. వర్షాలు మెల్లిగా తగ్గుముఖం పడుతున్న సమయంలో వాతావరణశాఖ ఈ నెల 6 ,7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అది తుఫాన్‌గా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. 
 
రెండు రోజుల్లో ఈ అల్పపీడనంపై పక్కాగా స్పష్టత వస్తుంది అంటున్నారు. వాయుగుండం నుంచి తేరుకోక ముందే మళ్లీ తుఫాన్ ఉద్రిక్తత మొదలైంది. 
తెలుగు రాష్ట్రాలు అతి భారీ వర్షాలతో భారీగా నష్టపోయాయి. ఏపీలో విజయవాడను వరద ముంచెత్తింది.. గతంలో ఎప్పుడూ లేని విధంగా వానలు పడ్డాయి. నగరం మొత్తం వరద గుప్పిట్లో చిక్కుకుంది. 
 
విజయవాడ, గుంటూరుపై ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ వరద ముప్పు తొలగలేదు. అటు రైల్వే ట్రాక్‌లు కూడా దెబ్బ తిన్నాయి. వందలాది రైళ్లు రద్దయ్యాయి. జాతీయ రహదారుల మీద వరద ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ఇలాంటి సమయంలో మరో తుఫాన్ ముప్పు అంటూ అంచనాలతో ఉద్రిక్తత పెంచుతోంది. 
 
మరోవైపు విజయవాడలో వరద బాధితుల్ని రక్షించే పనిలో ఉంది ప్రభుత్వం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. తమిళనాడు నుంచి 3, పంజాబ్ నుంచి 4, ఒడిశా నుంచి 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో వారు రంగంలోకి దిగారు.
 
ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో సహాయక చర్యల్లో 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మరో 4 హెలికాప్టర్లు విజయవాడకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్లకోసం రంగంలోకి దిగనున్నాయి. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండాలని, ప్రజలు భయాందళోనకు గురికావొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.
 
రాగల 24 గంటలలో ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలలో, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉందని విశాఖపట్నంలో వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. ఇక విదర్భ, తెలంగాణ ప్రాంతాలలో వాయుగుండం కొనసాగుతోందని తెలిపింది. రామగుండం పట్టణానికి ఉత్తర ఈశాన్య దిశగా 135 కిలోమీటర్లు, వాగ్ధాకు అగ్నేయంగా 170 కిలోమీటర్లు దూరంలో ఈ వాయు గుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. వాయువ్య దిశగా కదులుతూ రాగల 12 గంటలలో బలహీన పడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.