రేపటికే భారీ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం

రేపటికే భారీ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం
* విజయవాడ సింగ్ నగర్ లో చంద్రబాబు పర్యటన
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలు, నదులు ఉగ్రరూపాన్ని దాల్చాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. చాలా చోట్ల రాకపోకలు బందయ్యాయి. ఇప్పటికే జనజీవనం మొత్తం స్తంభించిపోయింది.  అయితే.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలుండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించటంత ముందస్తు జాగ్రత్తగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించాయి.
ఇప్పటికే చాలా ప్రాంతాల్లో జలదిగ్బంధనం కాగా.. భారీ వర్ష సూచనతో జనం తీవ్ర భయాందోళనలో ఉన్నాయి.  అదే వాతావరణ శాఖ తాజాగా ఇచ్చిన సమాచారంతో తెలుగు రాష్ట్రాలకు ఉపశమనం కలిగినట్టయింది. అల్పపీడనం వేగంగా ముందుకు కదులుతుండటంతో రేపటి వరకు భారీ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.
 
తెలంగాణకు మాత్రం మరో 24 గంటల పాటు భారీ వర్ష సూచన ఉందని అధికారులైతే చెబుతున్నారు. రాష్ట్రంలోని 8 జిల్లాలకు మాత్రం అత్యంత భారీ వర్ష సూచన ఉండటంతో వాటికి ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.
 
ఇక హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు కురుస్తాయని ముందుగా హెచ్చరించగా ఆ గండం కాస్త తప్పినట్టే కనిపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ అల్పపీడనం ఎట్టకేలకు హైదరాబాద్ నగరాన్ని దాటి వెళ్లిపోతుండటంతో.. ప్రమాదమేమి లేదని చెబుతున్నారు. అయినప్పటికీ హైదరాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్ కొనసాగుతోంది. మూసీ నదికి భారీగా ఇన్ ఫ్లోలు వస్తున్నాయి. 
ఇప్పటి వరకు తెలంగాణలో 25 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురవగా.. 51 చోట్ల అతి భారీ వర్షాలు.. 120 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో పలు చోట్ల 41, 35, 30 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవటం గమనార్హం.  రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనాలు అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
కాగా, విజయవాడ సింగ్​ నగర్​లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విజయవాడ నగరం చిగురుటాకులా వణుకుతోంది. ఎక్కడికక్కడ నిలిచిన వరదతో జనజీవనం అస్తవ్యస్తమైంది.  నగరంలోని సింగ్​నగర్, కానూరులోని కల్పన నగర్‌, మాణిక్యనగర్‌, సనత్‌నగర్‌తోపాటు పలు కాలనీల్లోని రహదారులు తటాకాల్లా మారాయి.
మురుగుకాల్వల వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రాంతమంతా జలదిగ్బంధమైంది. ఏరు-దారి ఏకమైపోవడంతో ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.  అపార్టుమెంట్ల సెల్లార్లను ఎక్కడికక్కడ వరద ముంచెత్తింది. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
గుంతల్లో వాహనాలు ఇరుక్కుపోతున్న పరిస్థితి నెలకొంది. నీటమునిగిన గుంతల్లో పడి బైక్‌ నడిపేవారు గాయాలపాలవుతున్నారు.  వరద ఉద్ధృతంగా ఉండటంతో చెత్త సేకరించేవారు కూడా పనులు మానేశారు. మంచి నీటి సరఫరా చేసే బోర్లు నీటమునిగాయి. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లోకి నీరు చేరి ప్రమాదకరంగా మారింది. దీంతో ప్రస్తుతం విజయవాడ సింగ్​ నగర్​లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు.