
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండురోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు విజయవాడ నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయంకావడంతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు.
24 గంటల వ్యవధిలో ఏకంగా 29 సెంటీమీటర్ల వర్షంతో వరుణుడు కుంభవృష్టి కురిపించాడు. దీంతో 30 ఏళ్ల కిందటి రికార్డు బద్ధలయ్యాయి. రహదారులన్నీ ఏరులయ్యాయి. ఏకధాటి వర్షాలకు మొగల్రాజుపురంలో కొండచరియలు ఇళ్లపై విరిగి పడి.. ఆరుగురు మృతి చెందారు.
బెంజిసర్కిల్‌లో 161 మిల్లీమీటర్లు, గన్నవరం ఎయిర్‌పోర్ట్ వద్ద 123 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు ఏపీకి చెందిన ప్రముఖ వాతావరణ నిపుణుడు కే ప్రణీత్ తెలిపారు. ఈస్థాయిలో ఆగస్టులో వర్షం కురువడం 200 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని చెప్పారు. తాడేపల్లిలో 121 మిల్లీమీటర్లు, మంగళగిరిలో 118 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
సరిగ్గా పాతికేళ్ల కిందట 1999లో ఈ స్థాయిలో వరదనీరు, వర్షపునీరు నగరంలోకి చేరి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో కృష్ణానది వెంట కరకట్టలు తెగిపోయేలా ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. బుడమేరు సైతం నాడు పొంగి అనేక ప్రాంతాలు మునకేశాయి. నాటి పరిస్థితులు తలిపించేలా ఇప్పుడు విజయవాడ నగరం వర్షపునీటితో మునిగిపోయింది.
రహదారులు, డ్రెయిన్లు ఏకమై.. పలు ప్రాంతాల్లో వర్షపునీరు 2-6 అగుడుల ఎత్తున నిలిచిపోయింది. శివారు ప్రాంతాలు, కాలనీలు పూర్తిగా నీటమునిగాయి.
శుక్రవారం రాత్రి నుండి శనివారం సాయంత్రం వరకు ఈ రెండు జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో విజయవాడ, గుంటూరు నగరాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి.
ఈ రెండు ప్రాంతాల్లోనూ ఎక్కడ చూసినా రోడ్లమీద వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరింది. విజయవాడ – గుంటూరు మధ్య 30 సెం.మీ వర్షపాతం నమోదుకాగా, విజయవాడలో 18 సెం.మీ, గుంటూరు తూర్పు మండలంలో 25 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఇటీవల సంవత్సరాల్లో ఇదే అత్యధిక వర్షం.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో మురుగుకాల్వలోకి కారు కొట్టుకుపోయి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌టిఆర్ జిల్లా చందర్లపాడులో వాగులో కొట్టుకపోయి మరొకరు మరణించారు. భారీగా వరద నీరు చేరడంతో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామం వద్ద హైవేవైపు వాహనదారులు ఎవ్వరూ రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
విజయవాడలో దుర్ఘాఘాట్, ఫ్లై ఓవర్లను మూసివేశారు. ఏలూరు సర్వజన ఆస్పత్రిలో వర్షపు నీరు చేరింది. ఆర్‌టిసి సర్వీసులను అధికారులు రద్దు చేశారు. విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (విటిపిఎస్)లో వరద నీరు చేరడంతో విద్యుదుత్పత్తి నిల్చిపోయింది. భారీ వర్షాల కారణంగా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 20 రైళ్లను రద్దు చేశారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
More Stories
ఫైళ్లను పట్టించుకోని చంద్రబాబు, ఆయన మంత్రులు
తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు
గిరిజన చట్టాలు సవరించాలన్న స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం