అస్సాం ముస్లిం ఎమ్మెల్యేలకు నమాజ్‌ విరామం రద్దు

అస్సాం ముస్లిం ఎమ్మెల్యేలకు నమాజ్‌ విరామం రద్దు
ముస్లిం శాసనసభ్యులకు ప్రతి శుక్రవారం నమాజ్ కోసం రెండు గంటలు విరామం ఇచ్చే దశాబ్దాల నాటి నిబంధనను రద్దు చేయాలని అస్సాం అసెంబ్లీ నిర్ణయించింది. ఇతర రోజుల మాదిరిగానే శుక్రవారం కూడా సభా కార్యకలాపాలను కొనసాగించాలని అసెంబ్లీ రూల్స్ కమిటీ శుక్రవారం తీర్మానం చేసింది. 
 
అయితే దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ముస్లిం ఎమ్మెల్యేలు ప్రార్థనలకు హాజరయ్యేందుకు వీలుగా ఇప్పటి వరకు ప్రతి శుక్రవారం అస్సాం అసెంబ్లీ రెండు గంటలు వాయిదా పడేది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సభను వాయిదా వేసేవారు. ముస్లిం సభ్యుల నమాజ్ అనంతరం లంచ్ సెషన్‌ తర్వాత అసెంబ్లీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేవి.

కాగా, మతపరమైన ప్రయోజనాల కోసం ఎలాంటి వాయిదా లేకుండా ఇతర రోజుల మాదిరిగానే శుక్రవారం రోజు కూడా సభా కార్యకలాపాలు కొనసాగడంపై స్పీకర్ బిస్వజిత్ డైమరీ దృష్టి సారించినట్లు అస్సాం అసెంబ్లీ కార్యాలయం పేర్కొంది. రాజ్యాంగంలోని లౌకిక స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారాల్లో ఏ విధమైన వాయిదా లేకుండా అస్సాం అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహించాలని స్పీకర్‌ ప్రతిపాదించినట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఈ నిర్ణయంపై స్పందించారు. ముస్లిం ఎమ్మెల్యేల నమాజ్ కోసం రెండు గంటల విరామాన్ని తొలగించడం ద్వారా అస్సాం అసెంబ్లీ ఉత్పాదకతకు ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. రెండు గంటలపాటు ఇస్తున్న జుమ్మా విరామాన్ని రద్దు చేయడం ద్వారా వలస పాలన కాలంనాటి మరో అవశేషాన్ని వదిలించుకున్నామని, అస్సాం శాసనసభ ఉత్పాదకతకే ప్రాధాన్యమిచ్చిందని శర్మ శుక్రవారం తెలిపారు. 1937లో ముస్లిం లీగ్‌కు చెందిన సయ్యద్ సాదుల్లా ఈ పద్ధతిని ప్రవేశపెట్టినట్లు ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

 బ్రిటిష్ కాలం నుండి, అస్సాం అసెంబ్లీలో ప్రతి శుక్రవారం ముస్లిం శాసనసభ్యులు నమాజ్ చేయడానికి మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల మధ్య మధ్య రెండు గంటల విరామం ఇస్తున్నారు. ఇప్పుడు అటువంటి విరామం లేకుండా ఈ నిబంధనలను మార్చారు. అస్సాం అసెంబ్లీ స్పీకర్ బిస్వజిత్ డైమరీ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఇతర శాసనసభ్యుల మద్దతు లభించడంతో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ సభల్లో నమాజ్‌కు విరామం ఇచ్చే నిబంధన లేదని అధ్యయనం చేశారు. అందుకే అస్సాం అసెంబ్లీ స్పీకర్ కూడా ఈ బ్రిటీష్ కాలంనాటి పాలనకు ముగింపు పలకాలని నిర్ణయించారు.
 
కాగా,  ముస్లిం వివాహాలు, విడాకులను ప్రభుత్వంతో తప్పనిసరిగా నమోదు చేయాలనే బిల్లును అస్సాం అసెంబ్లీ గురువారం ఆమోదించింది. ముస్లిం స్త్రీలు,  పురుషుల హక్కులను పరిరక్షించడం,యు బాల్య వివాహాలను తొలగించడం లక్ష్యంగా అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు బిల్లు, 2024ను అసెంబ్లీ ఆమోదించింది.
 
ఈ చట్టం పురాతన అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం, 1935 స్థానంలో తీసుకొచ్చారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి శర్మ మాట్లాడుతూ, “భారతదేశంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రాలు కేరళ,  జమ్ము కాశ్మీర్. లలో ముస్లిం వివాహాలను రిజిస్టర్ చేయాలని ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రం కేరళలో బిజెపి ఎన్నడూ అధికారంలో లేనందున ఈ చట్టాన్ని కాంగ్రెస్ లేదా లెఫ్ట్ ప్రభుత్వం తెచ్చి ఉండాలి” అని తెలిపారు. ముస్లిం మహిళల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ముస్లిం వివాహ రిజిస్ట్రేషన్ చట్టం వారికి భద్రత కల్పిస్తుందని స్పష్టం చేశారు.