కంగనారనౌత్‌ ఎమర్జెన్సీ విడుదలపై తెలంగాణాలో నిషేధం?

కంగనారనౌత్‌ ఎమర్జెన్సీ విడుదలపై తెలంగాణాలో నిషేధం?
బాలీవుడ్ నటి కంగనారనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రాజెక్ట్‌ ఎమర్జెన్సీ. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాలనలో 1975  జూన్‌ 25  నుండి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో కంగ‌నార‌నౌత్ ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. 
 
ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని ఎన్నికలకు ముందు వివాదాలకు అవకాశం ఇవ్వకుండా.. సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్‌.  విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో నిషేధం విధించే అవకాశాలున్నాయన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి. 
 
ఎమర్జెన్సీ సినిమా విడుదలపై ప్రభుత్వం న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతూ నిషేధం అంశాన్ని పరీలిస్తుందని ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ తెలిపారు. మాజీ ఐపీఎస్‌ అధికారి తేజ్‌ దీప్‌ కౌర్ మీనన్‌ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధుల బృందం షబ్బీర్‌ను కలిసి ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం విధించాలని కోరింది.
 
సిక్కు సమాజాన్ని కించపరిచే విధంగా సినిమా చిత్రీకరణ ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ 18 మంది సభ్యుల ప్రతినిధి బృందం  రిప్రజెంటేషన్‌ను సమర్పించినట్లు షబ్బీర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రంలో సిక్కులను తీవ్రవాదులుగా, దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని, ఇది ఆక్షేపణీయమైనది సమాజ ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరణ ఉందని వారు ఆరోపించారు. 
 
ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మేరకు సిక్కు సంఘం నాయకులకు హామీ ఇచ్చారని మహ్మద్‌ అలీ షబ్బీర్‌ తెలిపారు.  తదుపరి తెలంగాణలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని షబ్బీర్‌ ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన షబ్బీర్‌ అలీ.. సినిమా విడుదలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది
 
ఎమర్జెన్సీ సమయంలో పౌరహక్కుల సస్పెన్షన్‌, ఇందిరా గాంధీ వ్యతిరేకుల అరెస్టుతోపాటు పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలిసిందే. 
ఎమ‌ర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబ‌డ్డ ప్రముఖ రాజ‌కీయ వేత్త `లోక్ నాయక్’ జ‌య‌ప్రకాశ్‌ నారాయ‌ణ్ పాత్రలో పాపులర్‌ బాలీవుడ్‌ ద‌ర్శకనిర్మాత అనుప‌మ్ ఖేర్ న‌టిస్తుండగా.. శ్రేయాస్ తల్పడే, భూమికా చావ్లా ఇత‌ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఎమర్జెన్సీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన వివిధ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని కంగనా హోం బ్యాన‌ర్ మ‌ణి క‌ర్ణిక ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై రేణు పిట్టి, కంగ‌నార‌నౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు.