92 మంది అమెరికన్లపై రష్యా నిషేధం

92 మంది అమెరికన్లపై రష్యా నిషేధం
తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించిన అమెరికన్ల జాబితాలో 92 మందిని చేర్చినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీరిలో రష్యాలో పనిచేసిన మాజీ జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, న్యాయశాఖ అధికారులు ఉన్నారు.

రష్యాపై వ్యూహాత్మక ఓటమిని కలిగించే ప్రకటిత లక్ష్యంగా బైడెన్‌ ప్రభుత్వం అనుసరించిన రస్సోఫోబియా (రష్యా రాజకీయ వ్యవస్థ, విధానాల పట్ల వ్యతిరేకత) అనుసరిస్తున్న వారిపై ఈ నిషేధాన్ని విధించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రష్యా, రష్యా భద్రతా బలగాల పట్ల ప్రముఖ ఉదారవాద-ప్రపంచవ్యాప్త ప్రచురణల్లో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్న జర్నలిస్టులపై నిషేధం విధించినట్లు తెలిపింది.

నిషేధిత అమెరికన్ల జాబితాలో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఎమ్మా టక్కర్‌ సహా 11 మంది ప్రస్తుత లేదా మాజీ సిబ్బంది ఉన్నారు. డబ్ల్యుఎస్‌జె రిపోర్టర్‌ ఎవాన్‌ గెర్స్కోవిచ్‌ గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్‌ మరియు నేరారోపణలపై రష్యాను పదేపదే విమర్శించింది. ఎవాన్‌ 16 నెలలు జైలులో గడిపిన అనంతరం ఖైదీల మార్పిడిలో భాగంగా ఆగస్టులో విడుదలయ్యారు.

ఈ  జాబితాలో కీవ్‌ బ్యూరో చీఫ్‌ ఆండ్రూ క్రామెర్‌తో పాటు ఐదుగురు న్యూయార్క్‌ టైమ్స్‌ జర్నలిస్ట్స్‌, నలుగురు వాషింగ్టన్‌ పోస్ట్‌ జర్నలిస్టులు ఉన్నారు. అమెరికన్ల న్యాయ అధికారులు, విద్యావేత్తలు, వ్యాపారులు, స్వతంత్ర సంస్థలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. మంత్రిత్వ శాఖ జాబితా ప్రకారం రష్యా 2000 మందికి పైగా అమెరికన్లపై నిషేధం విధించింది.