
మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్‌లో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు తెలిపారు. ఛత్రపతి మహారాజ్‌ను తమ దైవంగా భావించే వారు ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యారని, వారికి తలవంచి క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. దైవం కంటే ఏదీ గొప్పది లేదని తెలిపారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా మాల్వాన్‌లో శుక్రవారం పర్యటించిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, క్షమాపణలు చెప్పే నైజం విపక్షాలకు లేకున్నా తాను మాత్రం శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై క్షమాపణలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. శివాజీ విగ్రహం కూలడంతో బాధపడిన మహారాష్ట్ర ప్రజలకు తాను శిరస్సు వంచి క్షమాపణలు చెబుతున్నానని ప్రధాని తెలిపారు.
ఈ ఘటనపై తాను క్షమాపణలు చెబుతున్నా ప్రతిపక్షాలు క్షమాపణలు చెప్పడం లేదని ప్రధాని విమర్శించారు. ఈ గడ్డ బిడ్డ వీర్ సావర్కర్‌ను అవమానిస్తున్నారని విపక్షాలపై ప్రధాని విరుచుకుపడ్డారు. వీర్ సావర్కర్‌ను తూలనాడినా, శివాజీ మహరాజ్ విగ్రహం నేలకూలినా వారు విచారం వ్యక్తం చేయరని ధ్వజమెత్తారు.క్షమాపణలు చెప్పినా, వారు కోర్టులకు వెళ్లి పోరాడేందుకు సిద్ధంగా ఉంటారని ఆరోపించారు. సింధ్‌దుర్గ్ జిల్లాలో గత ఏడాది డిసెంబర్లో నేవీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహం ఆగస్టు 26న కూప్పకూలింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించడంతో పాటు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రాజీనామాకు డిమాండ్ చేశాయి.
ఈ క్రమంలో మహారాష్ట్రలో మోదీ శుక్రవారం పర్యటించారు. ”మాకు ఛత్రపతి శివాజీ అంటే కేవలం ఒక పేరు కాదు, దైవం. మా దైవానికి తలవంచి క్షమాపణ చెప్పుకుంటున్నాను. మాకు భిన్నమైన విలువలు ఉన్నాయి. ఈ గడ్డలో లో పుట్టిన భరతమాత పుత్రుడు వీర సావార్కర్‌ను నిరంతరం అవమానించే కొందరి వ్యక్తుల తరహాలో మేము ఉండం. వాళ్లు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా లేరు. కోర్టులకు వెళ్లేందుకు, పోరాడేందుకే సిద్ధంగా ఉంటారు” అని విపక్షాల తీరును మోదీ ఎండగట్టారు.
ఇక అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ పాల్ఘర్లో వధ్వాన్ పోర్టుకు శంకుస్ధాపన చేశారు. రూ. 76,000 కోట్లతో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఇక రూ. 1560 కోట్ల విలువైన ఫిషరీస్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
కాగా, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ శుక్రవారం మాల్వాన్‌లోని రాజ్‌కోట్ కోటలో విగ్రహం కూలిపోయిన ప్రదేశాన్ని సందర్శించి, అదే స్థలంలో ఆ యోధుడి గొప్ప విగ్రహాన్ని నిర్మిస్తామని ప్రమాణం చేశారు. ఎక్స్ లో ఒక పోస్ట్‌లో, పవార్ శివాజీని మహారాష్ట్ర ఆత్మగౌరవంకు ప్రతీక అని పేర్కొన్నారు. “అతి త్వరలో అదే స్థలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నాము. ఇది నా మాట” అని పవార్ స్పష్టం చేశారు. ముంబైకి 480 కిలోమీటర్ల దూరంలోని సింధుదుర్గ్ జిల్లా మాల్వాన్ తహసీల్‌లో ఏర్పాటు చేసిన నిర్మాణం కూలిపోయినందుకు పవార్ బుధవారం రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
More Stories
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!