విజయవాడ, విశాఖలకు మెట్రో రైల్ డిపిఆర్ లు సిద్ధం

విజయవాడ, విశాఖలకు మెట్రో రైల్ డిపిఆర్ లు సిద్ధం

రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులకు రెండు దశల్లో చేపట్టేందుకు అధికారులు డీపీఆర్‌లు సిద్ధం చేశారు. విభజన చట్టంలోనే మెట్రో రైలు ప్రాజెక్టులు ఉన్నందున పనులను సత్వరమే చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

ఈ రెండు ప్రాజెక్ట్‌ ల ఫేజ్‌ వన్‌ కు సంబంధించిన అంచనాలను వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే మెట్రో నిర్మాణానికి సంబంధించి కేంద్రం వద్ద నాలుగు రకాల ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. విభజన చట్టం ప్రకారం మెట్రో నిర్మాణం మొత్తం కేంద్రమే భరించాల్సి ఉంటుంది.

విజయవాడకు ఇప్పటికిప్పుడు మెట్రో రైలు అవసరం లేకపోయినా రాబోయే పదేళ్లలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని కీలకమైన మెట్రో ప్రాజెక్ట్‌ లు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాఫిక్‌ కంట్రోల్‌ కోసం ప్రపంచం మొత్తం మెట్రో రైలు పై ఆధారపడిందని, పెరిగే జనాభా ప్రకారం విజయవాడకు మెట్రో అవసరం ఉంటుందని సీఎం పేర్కొన్నారు.

విజయవాడ మెట్రో తొలి దశలో విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ వరకూ 25.95 కిలో మీటర్లు, బస్టాండ్‌ నుంచి పెనమలూరు వరకూ 12.45 కిమీ నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం మొదటి దశలో 38.40 కిమీ మేర నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం రూ.11,009 కోట్లు ఖర్చవుతుంది.

రెండో దశలో పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి అమరావతి రాజధానికి మొత్తం 27.80 కిలో మీటర్ల మేర మెట్రో నిర్మాణం చేసేలా డీపీఆర్‌ రూపకల్పన చేసారు. ఇందుకు రూ.14,121 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మొత్తంగా విజయవాడ మెట్రోకు రెండు దశల్లో కలిపి 66.20 కిలో మీటర్ల మేర నిర్మించే ప్రాజెక్ట్‌ కు రూ.25,130 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

విశాఖ పట్నంలో రెండు దశల్లో నాలుగు కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ సిద్దం అయింది. మొదటి దశలో స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాడి వరకూ 34.40 కిలో మీటర్ల మేర మొదటి కారిడార్‌, గురుద్వారా నుంచి ఓల్డ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ వరకూ మొత్తం 5.07 కిలో మీటర్ల మేర రెండో కారిడార్‌, తాడిచెట్ల పాలెం నుంచి చిన వాల్తేరు వరకూ 6.75 కిలో మీటర్ల మేర మూడో కారిడార్‌ నిర్మాణం చేపట్టనున్నారు.