
దవాఖానల్లో వైద్యుల భద్రత, వారిపై దాడులు, హింసను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం బుధవారం రాష్ర్టాలకు పలు సూచనలు చేసింది. లోపాలను గుర్తించి, తగిన చర్యలు తీసుకొనేందుకు జిల్లా దవాఖానల్లో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాలని, రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ చేపట్టాలని, పెద్ద దవాఖానల వద్ద నియంత్రిత యాక్సెస్ ఉండాలని పేర్కొన్నది.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. వైద్యుల భద్రతకు సంబంధించి తాము నియమించిన నేషనల్ టాస్క్ ఫోర్స్(ఎన్‌టీఎఫ్) ప్రొటోకాల్‌ను రూపొందించేంత వరకు విధి నిర్వహణ సమయంలో భద్రతపై వైద్యుల ఆందోళనలను పరిష్కరించేందుకు రాష్ర్టాల్లో తగిన చర్యలు ఉండేలా చూడాలని న్యాయస్థానం కేంద్ర ఆరోగ్య శాఖను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఎన్‌టీఎఫ్ మంగళవారం తొలి భేటీ జరిగింది. బుధవారం జరిగిన వర్చువల్ సమావేశానికి కేంద్ర హోం, ఆరోగ్య శాఖ కార్యదర్శులతోపాటు రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.
డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది భద్రతకు సంబంధించి 26 రాష్ర్టాలు/యూటీల్లో ఇప్పటికే చట్టాలు ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ఇతర రాష్ర్టాలు కూడా అలాంటి చట్టాలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కోరినట్టు కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటన పేర్కొన్నది.
బ్లైండ్ స్పాట్‌ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వైద్య సిబ్బంది కోసం 112 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏకీకృతం చేయాలని రాష్ర్టాల అధికారులను మోహన్ కోరారు. ఇంకేమైనా కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని అపూర్వ చంద్ర రాష్ర్టాలకు సూచించారు. హాస్పిటల్స్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, రెగ్యులర్‌గా సెక్యూరిటీ, ఫైర్ డ్రిల్స్ నిర్వహించాలని చెప్పారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్