
‘‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటనలు చేయాలా?. రాజకీయ నాయకులు, న్యాయ వ్యవస్థ మధ్య పరస్పర గౌరవం ఉండాలి. రాజకీయ కారణాలతో మేము ఆదేశాలు జారీ చేశామని ఏ వ్యక్తైనా ఎలా చెప్పగలరు?. మీరు మమ్మల్ని గౌరవించనంత మాత్రాన మేము మీ కేసు విచారణను వేరే చోటికి బదిలీ చేస్తామా?” అని ధర్మాసనం ప్రశ్నించింది. “ఇది దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం. నిన్ననే మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శికి (అటవీ, రెవెన్యూ శాఖ) నోటీసులు జారీ చేశాం. ఏదైనా రాజకీయ పార్టీని సంప్రదించిన తర్వాత మా ఆదేశాలను జారీ చేస్తామా?. మనస్సాక్షి, ప్రమాణం చేసిన విధంగా మేము మా విధులను నిర్వహిస్తాం’’ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమ ఆదేశాలపై విమర్శలు వచ్చినా తామేమీ బాధపడమని, కానీ తాము తమ అంతరాత్మ ప్రకారమే విధులను నిర్వర్తిస్తుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా ఓటుకు నోటు కేసు బదిలీపై విచారణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేయగలరని, సాక్ష్యాలను తారుమారు చేయగలరని పిటిషనర్ల తరపు లాయర్లు వాదించారు. ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి భోపాల్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిటిషన్‌ను దాఖలు చేశారు.
విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ బదిలీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కేవలం అపోహలతో విచారణను బదిలీ చేస్తే మన న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని ధర్మాసనం తెలిపింది. సిఎం రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న 2015లో ఓటుకు నోటు కేసులో విచారణకు ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
కాగా, బుధవారం కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగానే “కవిత బెయిల్ కోసం ఎంపీ సీట్లు బీఆర్ఎస్ త్యాగం చేసింది నిజం. బీఆర్ఎస్ – బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది. సిసోడియా, కేజ్రీవాల్‌కు రాని బెయిల్ 5 నెలల్లోనే కవితకు ఎలా వచ్చింది? మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లలో బీజేపీకి మెజారిటీ ఇచ్చింది నిజం కాదా? ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయి, 15 చోట్ల మూడవ స్థానం వచ్చేంత బలహీనంగా బీఆర్ఎస్ ఉందా?” అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!