ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కీలక నిర్ణయం తీసుకున్నది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై వైద్యుల సంఘం క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు ఈ చర్యలు చేపట్టింది. బాధితురాలి తల్లిదండ్రుల మనోవేదనను అర్థం చేసుకోలేకపోవడం, సమస్యను సముచితంగా ఎదుర్కోలేకపోవడం, పరిస్థితి పట్ల సానుభూతి, సున్నితత్వం లేకపోవడం వల్ల మీకు వ్యతిరేకంగా ఈ చర్య చేపట్టినట్లు సస్పెన్షన్ ఆర్డర్‌లో పేర్కొంది.
“హత్యాచార ఘటనను ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌వి అశోకన్ నేతృత్వంలోని కమిటీ సుమోటోగా స్వీకరించింది. ఐఎంఏ ప్రధాన కార్యదర్శితో కలిసి బాధితురాలి తల్లిదండ్రులను కలిసింది. ఆ సమయంలో సందీప్ ఘోష్ తన బాధ్యతను విస్మరించారని వారు చెప్పారు. ఐఎంఏ బంగాల్ రాష్ట్ర శాఖతో పాటు కొన్ని వైద్య సంఘాలు మీ(సందీప్ ఘోష్) పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అందుకే క్రమశిక్షణా చర్యల కమిటీ మీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది” అని ఆర్డర్ కాపీలో ఐఎంఏ పేర్కొంది.
‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యత్వం నుంచి మిమ్మల్ని తక్షణమే సస్పెండ్ చేయాలని ఐఎంఏ ప్రధాన కార్యాలయం క్రమశిక్షణా కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు ఆగస్ట్ 9న ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసులో సందీప్ ఘోష్ తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆగస్టు 12న ప్రిన్సిపాల్ పదవికి ఆయన రాజీనామా చేశారు. అయితే వెంటనే మరో మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా ఆయన నియమితులయ్యారు.
దీంతో సందీప్ ఘోష్‌పై పలు అనుమానాలు రేకెత్తాయి. వైద్యురాలి హత్యాచార కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆయనను అరెస్ట్ చేయడంతో పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించింది. అలాగే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కూడా సీబీఐ దర్యాప్తు చేస్తున్నది.
More Stories
ఆస్ట్రేలియాపై భారత మహిళల విజయం.. మంధాన సెంచరీ
నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులు … ఇద్దరు ఎన్కౌంటర్
ఢిల్లీ యూనివర్సిటీలో ఎబివిపి అభ్యర్థులకు ట్రంప్ ప్రచారం!