కోల్‌క‌తా ఘ‌ట‌న భ‌యాన‌కం

కోల్‌క‌తా ఘ‌ట‌న భ‌యాన‌కం
 
* తొలిసారి రాష్ట్రపతి ముర్ము స్పందన
 
కోల్‌క‌తాలో ట్రైనీ వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌పై రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము తొలిసారి స్పందించారు. ఆ ఘ‌ట‌న నిరాశ‌ను, భ‌యాన్ని క‌లిగించిన‌ట్లు ఆమె చెప్పారు. ఇక జ‌రిగింది చాలు అని ఆమె పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థ‌తో మాట్లాడుతూ ద్రౌప‌ది ముర్ము ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఒక‌వైపు విద్యార్థులు, డాక్ట‌ర్లు, పౌరులు.. కోల్‌క‌తా ఘ‌ట‌న ప‌ట్ల నిర‌స‌న చేప‌డుతుంటే, మ‌రో వైపు నేర‌స్థుల మాత్రం స్వేచ్ఛ‌గా తిరుగుతున్న‌ట్లు ఆమె ఆరోపించారు. 
 
అకృత్యాల‌కు ఏ నాగ‌రిక స‌మాజం కూడా త‌మ కూతుళ్లు, సోద‌రీమ‌ణుల‌ను బ‌లి ఇవ్వ‌ద‌ని ఆమె స్పష్టం చేశారు. స‌మాజం త‌న‌ను తాను ఆత్మప‌రిశీల‌న చేసుకోవాల‌ని, కొన్ని క‌ఠినమైన ప్ర‌శ్నలు వేసుకోవాల‌ని ఆమె సూచించారు. నిర్భ‌య ఘ‌ట‌న జ‌రిగిన 12 ఏళ్ల కాలంలో స‌మాజం ఎన్నో అత్యాచార ఘ‌ట‌న‌ల‌ను మ‌రిచిపోయింద‌ని పేర్కొంటూ ఇటువంటి సామూహిక మ‌తిమ‌రుపు అస‌హ్య‌క‌ర‌మైద‌ని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
గ‌త త‌ప్పుల‌ను ఎదుర్కొనేందుకు స‌మాజం భ‌య‌ప‌డుతోంద‌ని చెబుతూ కానీ ఇప్పుడు చ‌రిత్ర‌ను స‌మూలంగా మార్చేందుకు సమ‌యం ఆస‌న్న‌మైంద‌ని ఆమె పిలుపిచ్చారు. స‌మ‌గ్ర‌మైన రీతిలో ఈ స‌మ‌స్య‌ను నిర్మూలించేందుకు ప్ర‌య‌త్నిద్దామ‌ని ఆమె సూచించారు.