పోలవరంకు కేంద్రం రూ. 12,000 కోట్లు, రెండు పారిశ్రామిక వాడలు

పోలవరంకు కేంద్రం రూ. 12,000 కోట్లు, రెండు పారిశ్రామిక వాడలు
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ. 12 వేల కోట్లకు ఆమోదం తెలుపడంతో పాటు రాష్ట్రంలో 2 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం సిద్ధమైంది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాకు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 12 వేల కోట్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
అలాగే పోలవరం ప్రాజెక్టును గతంలో నిర్మించిన నిర్మాణ సంస్థలకే పనులు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు.  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వెనక్కి వెళ్లిందని ఆయన విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పోలవరంపై దృష్టి పెట్టారని, ఆయన నాయకత్వంలో ఇవన్నీ సాధ్యమవుతున్నాయని చెప్పారు.
ఏపీకి నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ఒక్కటే కాదు.. మరికొన్ని కేటాయింపులు కూడా చేసినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇవాళ జరిగిన కేబినెట్‌లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని చెబుతూ పారిశ్రామిక కారిడార్లు దేశ వ్యాప్తంగా 12 ఏర్పాటు చేస్తే అందులో 2 ఏపీలోనే ఉన్నాయని చెప్పారు. బడ్జెట్‌లో చెప్పిన కొద్దిరోజుల్లోనే వాస్తవ రూపంలోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. 

హైదరాబాద్ – బెంగళూరు కారిడార్, విశాఖ – చెన్నై కారిడార్‌లో భాగంగా ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఓర్వకల్లులో ఒకటి, కొప్పర్తిలో ఒకటి ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. ఒక్క ఓర్వకల్లు నోడ్‌లో రూ. 12 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. 2,596 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ కోసం రూ.2,137 కోట్లు కేటాయించనున్నారు.

కొప్పర్తి ఇండస్ట్రియల్ సిటీకి రూ.8,860 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, సుమారు 54 వేల మందికి ఉపాధి లభించనుందని కేంద్రం తెలిపింది. 2,621 ఎకరాల్లో రానున్న ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కోసం రూ.2,786 కోట్ల వ్యయం చేయనున్నట్లు పేర్కొంది. ఇక్కడ రూ.12 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, సుమారు 45 వేల మందికి ఉపాధి దొరకనుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.

డబుల్ ఇంజన్ గ్రోత్ ఓరియెంటెడ్ ప్రభుత్వం కారణంగా ఇది సాధ్యమైందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత కొన్నేళ్లలో ఏపీ అనేక రంగాల్లో వెనుకబడిపోయిందని, అందుకే ప్రజలు తిరుగులేని మెజారిటీతో చంద్రబాబు-మోదీ -పవన్ కళ్యాణ్ లను ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. 

పోలవరం ప్రాజెక్టుకు పెరిగిన అంచనా వ్యయం రూ 12,000 కోట్ల మేర నిధులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందనిచెబుతూ వర్షాకాలం ముగిసిన వెంటనే పనులు మొదలుపెట్టాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం సహా నవంబర్ నుంచి పోలవరం పనులను వేగం పెంచేందుకు మొదటి దశ ప్యాకేజీ నిధులు కీలకం కానున్నాయి.

పెండింగ్ అంశాలను కూడా త్వరగా పరిష్కరించే బాధ్యత తాము తీసుకుని ముందుకు నడిపిస్తామని స్పష్టం చేశారు. కొత్త డయాఫ్రమ్ వాల్ సహా పెరిగిన అంచనా వ్యయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొంటూ ఇది ఏపీకి మేలు చేస్తుందని తెలిపారు. అమరావతి, పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

కాగా, ఓర్వకల్లులో 2621 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ ఏర్పాటు కానుంది. ఇక క్యాబినెట్‌ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. నేషనల్‌ ఇండస్ట్రియల్ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలకు క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. 

ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 28,602 కోట్లను వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఏకంగా రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టుతో 10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 30 లక్షల పరోక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అశ్వనీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. ఈ కారిడార్లలో ప్లగ్‌ అండ్ ప్లే, వాక్‌ టూ వర్క్‌ కాన్సెప్ట్‌పై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.

కొప్పర్తి, ఓర్వకల్లు హబ్ లతో రాయలసీమకు పారిశ్రామిక శోభ రానుందని టీడీపీ అభిప్రాయపడింది. కడప జిల్లాలో కొప్పర్తి, కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు ప్రాంతాలలో భారీ పారిశ్రామిక హబ్ లు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపింది. జగన్ సాధించలేనిది చంద్రబాబు సాధించారని సీమ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారని టీడీపీ నేతలు అంటున్నారు.