యుద్ధరంగంగా మారిన కోల్‌కతా రోడ్లు

యుద్ధరంగంగా మారిన కోల్‌కతా రోడ్లు
* విద్యార్థులపై వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్  * బెంగాల్ బంద్ కు బిజెపి పిలుపు
 
బెంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘం పశ్చిమ బంగా ఛాత్రో సమాజ్‌ మంగళవారం చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. నబన్నా అభియాన్ పేరుతో హావ్‌డా నుంచి ప్రారంభమైన ర్యాలీని సంతర్‌గాచి వద్ద పోలీసులు అడ్డుకోవడం వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లతో విద్యార్థి సంఘం ‘పశ్చిమబంగా ఛాత్రో సమాజ్’ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
కాగా, విద్యార్థుల నిరసన సందర్భంగా హింసకు మమతా బెనర్జీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్ష నేత సువెందు అధికారి స్పష్టం చేశారు. వైద్యురాలిపై అత్యాచారం, హత్యా సంఘటనపై బుధవారం 12 గంటల పాటు బెంగాల్ బంద్ కు బిజెపి పిలుపిచ్చింది. మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
 
 విద్యార్థులకు, పోలీసులకు మధ్య తలెత్తిన ఘర్షణలతో కోల్‌కతా రోడ్లు యుద్ధరంగంగా మారారు. హౌరా బ్రిడ్జి నుంచి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు, బాష్పవాయువు ప్రయోగించారు. రాష్ట్ర సచివాలయం నబన్నా వరకూ విద్యార్థులు చేపట్టిన ర్యాలీని రోడ్లపైనే పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనలు నిర్వహించేందుకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకుంటూ టియర్ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించారు.
 
“మమ్మల్ని పోలీసులు ఎందుకు కొట్టారు? మేం ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదు. చనిపోయిన డాక్టర్‌కు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధ్యత వహించి రాజీనామా చేయాలి” అని నిరసనలో పాల్గొన్న ఓ మహిళ డిమాండ్ చేశారు. అయితే నిరసనకారుల రాళ్ల దాడిలో పలువురు పోలీసు అధికారులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ర్యాలీ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
 
కాగా, ర్యాలీలతో అశాంతిని రెచ్చగొట్టేందుకు కుట్ర జరుగుతోందంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. నిరసన ప్రదర్శన నేపథ్యలో కోల్‌కతా పోలీస్ జ్యురిష్‌డిక్షన్‌లో 25 మంది ఐపీఎస్ అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రాష్ట్ర సెక్రటరీకి దారితీసే మార్గాల్లో 30 మంది ఐపీఎస్ అధికారులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసన ర్యాలీలు చట్టవిరుద్ధమంటూ జిల్లా యంత్రాగం ప్రకటించినప్పటికీ ‘నబన్నా అభియాన్’ ర్యాలీతో ముందుకు వెళ్లాలని పశ్చిమబంగా ఛాత్ర సమాజ్ నిర్ణయించింది