తెలంగాణాలో భారీగా సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల గోల్‌ మాల్‌

తెలంగాణాలో భారీగా సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల గోల్‌ మాల్‌
అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలపై ‘హైడ్రా’ చర్యల నుంచి కోలుకోక ముందే రాష్ట్రంలో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అనేక మంది రాజకీయ నేతల మూలాలు కదిలే ఈ వ్యవహారంపై క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్మెంట్‌ (సీఐడీ) తాజాగా ప్రభుత్వానికి విచారణ నివేదికను సమర్పించింది. 
 
భారీగా సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల గోల్‌ మాల్‌ జరిగినట్లు నిజాలు నిగ్గుతేలడంతో బాధ్యులైన వ్యక్తులు, ఆస్ప్రత్రులపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చర్యలకు సిద్ధమవుతున్నారు.  నిరుపేద రోగుల సహాయార్థం ఉద్దేశించిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్‌) సొమ్ము దుర్వినియోగం అయింది. రోగులకు చికిత్స అందించకుండానే నకిలీ బిల్లులతో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు కొట్టేసి మోసాలకు పాల్పడ్డట్లు తాజాగా సీఐడీ గుర్తించింది. 
 
ఈ మేరకు ప్రజల సొమ్మును లూటీ చేసి హైదరాబాద్‌, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లోని మొత్తం 30 ప్రైవేటు ఆసుపత్రులపై ఆరు కేసులను సీఐడీ బుక్‌ చేసింది. గతేడాది ఏప్రిల్‌ కు ముందు ఆసుపత్రులు ఈ దందాను నిర్వహించినట్లు ఎఫ్‌ఐఆర్‌ లో సీఐడీ పేర్కొంది.
 వీటిలో 10 హాస్పిటల్స్‌ ఖమ్మం నగరానికి చెందినవే కావడం చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ ఆస్పతులన్నీ ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌, వరంగల్‌, నల్లగొండ, మహబూబాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాకు చెందినవిగా గుర్తించారు. వాటిపై విచారణ కొనసాగుతోంది. కొన్ని ఆస్పత్రుల్లో అయిన బిల్లుల కంటే అదనంగా రశీదులు సమర్పించి నిధులు నొక్కిసినట్టు తెలుస్తోంది. 
 
గత ప్రభుత్వ హయాంలో ఈ నిధుల దుర్వినియోగం జరిగిన నేపథ్యంలో నూతనంగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పారదర్శకత కోసం సిఎంఆర్‌ఎఫ్‌ స్కీమ్‌ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించేలా కొద్దిరోజుల క్రితం మార్పులు చేసింది. ఈ కేసులో గతమంలోనే మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు వద్ద టేడా ఎంట్రీ ఆపరటర్‌గా పని చేసే వ్యక్తిపై సైతం కేసు నమోదు అయింది.
 
ఏడాదిన్నర క్రితం మంచిర్యాల జిల్లాలోనూ ఇలాంటి కుంభకోణం వెలుగు చూసింది. దీనిపై అక్కడి సిసిఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సిఎంఆర్‌ఎఫ్‌ నిధులు డ్రా చేసేందుకు లేని దవాఖానలను కూడా నిందితులు సృష్టించారు. ఆ జిల్లాలో ఓ మహిళ పేరుతో చెక్‌ మంజూరైంది.  దానిని తీసి తనకు ఇవ్వాలని ఓ ప్రజాప్రతినిధి ఆమెపై ఒత్తిడి చేశారు. దీనిపై ఆమె ఆరా తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
దీనిపై అప్పటి నుంచే సిఐడి దృష్టి సారించింది. ఈ క్రమంలో 500 దరఖాస్తులపై అనుమా నాలు ఉన్నట్టు గుర్తించింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యంపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వ ఉద్యో గులు, ప్రజా ప్రతినిధులు, వారి అనుచరుల ప్రమేయంతోనే రూ.కోట్లలో ఈ స్కామ్‌ జరిగినట్టు తెలుస్తోంది. అయితే సిఐడి అధికారికంగా దీన్ని ధ్రువీకరించాల్సి ఉంది.