కూటమి వంద రోజుల్లో రూ.15,000 కోట్ల అప్పులతో రికార్డు!

కూటమి వంద రోజుల్లో రూ.15,000 కోట్ల అప్పులతో రికార్డు!
టీవీ గోవింద రావు,
ఫౌండర్ చైర్మన్, సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు సామాజిక అభివృద్ధి విషయాల అధ్యయన సంస్థ, మండపేట
 
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో ప్రభుత్వం ఏమి చేసింది అంటే అప్పులే అన్న చర్చ సాగుతోంది. ఏపీ అప్పుల కుప్ప అంటూ వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది కూటమి నేతలే. ఏపీ శ్రీలంకగా మారుతుంది అని కూడా ఎన్నో పోలికలు తెచ్చి జనాలను ఆందోళనకి గురి చేశారు. అప్పులు తెచ్చి ఏపీని వైసీపీ ప్రభుత్వం సర్వ నాశనం చేసింది అని కూడా కూటమి పెద్దలు గతంలో  ఆరోపించారు.   
 
తాము సంపద సృష్టించి చూపిస్తామని కూడా చెప్పారు. ఆ విధంగా చూస్తే ఏపీలో సంపద సృష్టికి కూటమి పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటో ఎవరికీ తెలియదు కానీ అప్పులు మాత్రం పెద్ద ఎత్తున చేస్తున్నారు. జూన్ 12న కూటమి సర్కార్ ఏపీలో అధికారంలోకి వచ్చింది. దానికి ఒక రోజు ముందు నుంచే అప్పులు చేయడం మొదలెట్టింది. 
 
ఇలా ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు చూస్తే ఏకంగా రూ. 15,000 కోట్లకు పెరిగిపోయాయని. కేవలం రెండున్నర నెలలోనే ఇంత అప్పు చేస్తే మిగిలిన నెలలలో అప్పులు తలచుకుంటే భయపడాల్సిందే అని అంటున్నారు. ఈ అప్పు లెక్కలు ఒక్కసారిగా చూస్తే జూన్ 11న నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో రూ. 2,000 కోట్లను అప్పుగా తెచ్చింది. 
 
ఆ తరువాత అదే నెలలో 25వ తేదీన సెక్యూరిటీ వేలంలో మరో రూ. 2,000 కోట్లు  అప్పుగా తెచ్చింది. ఇక జూలై నెలలో చూసుకుంటే అదే నెల 2వ తేదీన రూ. 5,000 కోట్లు, 16న రూ. 2,000 కోట్లు, 30న రూ. 3,000 కోట్లు అప్పు తెచ్చింది కూటమి సర్కార్. ఇక తాజాగా ఆగస్టు నెలలో చూస్తే ఈ నెల 27న మరో రూ. 2,000 కోట్ల అప్పు కోసం రిజర్వ్ బ్యాంక్ కి ఇండెంట్ పెట్టింది. సెక్యూరిటీ వేలం ద్వారా ఈ అప్పు తెస్తున్నారు. 
 
ఈ విధంగా ఇప్పటికి ఆరు సార్లు సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి అప్పులు తేవడం జరుగుతోంది. మరి ఈ అప్పులు కొండలా పెరిగిపోతున్నాయి. పైగా వీటి కాల పరిమితి కూడా 12 నుంచి 25 ఏళ్ళ దాకా ఉంటుంది. అంటే మరి రెండు మూడు తరాలకు సరిపడా ఈ అప్పు అన్న మాట. ఈ విధంగా అప్పులు తేవడం సులువే కానీ తీర్చేటప్పుడు భారంగా ఉంటుంది.
మరో వైపు ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా ఏడు నెలలు మిగిలి  ఉండగానే ఏపీ ప్రభుత్వం ఇంత అప్పు తెస్తే సగటున మిగిలిన నెలలకు దీనిని వేసుకుంటే నెలకు రూ. 7,000 కోట్ల వంతున అర లక్ష కోట్లు 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా చేయడం ఖాయమని భావిస్తున్నారు. అంటే కూటమి సర్కార్ తొలి ఆర్థిక సంవత్సరం పూర్తి చేసే నాటికి మొత్తం రూ. 70,000 కోట్లు దాకా అప్పులు చేస్తుందా? అన్న చర్చ అయితే ఉంది. 
 
ఎందుకంటే ఏపీకి ఏ విధంగానూ ఆదాయం లేదు. పైగా వచ్చే రెవిన్యూలో పాత అప్పులకు వడ్డీలు కట్టడానికి తీసి పెట్టాలి. ఉద్యోగుల జీతాలు, సామాజిక పెన్షన్లు కూడా లెక్క తీసి పక్కన పెట్టాలి. దాంతో కాలు కదిపేందుకు కూడా లేదు. ఇక ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 15,000 కోట్లను రుణంగానే తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కూడా పాతిక నుంచి ముప్పయ్యేళ్ల కాలపరిమితిలో తీర్చాల్సి ఉంటుంది. 
 
ఇక రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులు ఉత్పాదక రంగాల మీద పెట్టడం లేదు. అమరావతిని పక్కన పెడితే సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి తెస్తున్న అప్పులు దైనందిన ఆర్ధిక వ్యవహారాల కోసమే ఉపయోగిస్తున్నారు. దీంతో అప్పులు తప్పడం లేదు. అయితే ఇన్ని అప్పులు తెచ్చి కూడా ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. 
 
ఏపీలో ఇప్పటికే ఎలా చూసుకున్నా రూ. 10 లక్షల కోట్లకు పైగా అప్పు ఉంది. అది కాస్తా మరింతగా పెరిగితే ఏపీ అప్పులకు కట్టిన వడ్డీలు తీర్చేందుకే ఏటా వచ్చే రెవిన్యూ సరిపోక ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. మరి ఏపీలో అప్పులు తగ్గి ఆస్తులు పెరిగేది ఎప్పుడో అన్నదైతే సామాన్యుడికి చింతగానే ఉంది.
అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తున్నా కూటమి ప్రభుత్వం పింఛన్లు తప్పా ఇంకే పథకం అమలు చేయలేక పోతున్నారు .  ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి మూడు నెలలు అవుతున్నా ఉచిత ఆర్టీసీ, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, రైతులకు రాయితీ వంటి పథకాలు అమలు చేయలేదు. 
 
ప్రతి మహిళకు నెలకు  రూ1,500 లు, ఉచిత గ్యాస్ సిలెండర్ లు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? ముఖ్యంగా 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు పింఛను అమలు చేస్తామని చెప్పి అది కూడా అమలు చేయలేదు .ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారో?