
రైతుల ఆందోళన గురించి పార్టీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీ (బిజెపి) సోమవారం తనకు సంబంధం లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు చేయవద్దని మండి సిట్టింగ్ ఎంపీ అయిన కంగనా రనౌత్ ని పార్టీ ఆదేశించింది. రైతు నిరసనల విషయంలో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోకుంటే మన దేశంలో కూడా బంగ్లాదేశ్ లాంటి సంక్షోభం ఏర్పడవచ్చంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ బాధ్యత వహించబోదని స్పష్టం చేసింది.
పార్టీ తరపున విధానపరమైన అంశాలపై మాట్లాడే అధికారం కంగనా రనౌత్‌కు లేదని, అందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదని తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటనలో బీజేపీ స్పష్టత ఇచ్చింది. కంగనాను సున్నితంగా మందలించిన అధిష్ఠానం వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించింది.
సమ్మిళిత అభివృద్ధికి కంగనా కట్టుబడి ఉండాలని సూచించింది. సామాజిక సామరస్య విధానాల విషయంలో పార్టీ నిబద్ధతతో ఉందని పునరుద్ఘాటించింది. కాగా రైతుల ఉద్యమంపై కంగనా రనౌత్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంలో విదేశాల కుట్ర ఉందని ఆరోపించారు. రైతు నిరసలను అదుపు చేయకపోతే బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు వస్తాయని ఆమె హెచ్చరించారు.
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని ఎక్స్ వేదికగా షేర్ చేసిన వీడియోలో ఆమె ఆరోపించారు. సాగు చట్టాలను వెనక్కితీసుకున్నా నిరసనలు కొనసాగేలా విదేశీ శక్తులు, స్వా్ర్ధప్రయోజనాలు ఆశించే వారు ప్రోత్సహించారని ఆమె దుయ్యబట్టారు. ఆమె వాఖ్యలు హర్యానా ఎన్నికల సమయంలో బిజెపి నేతలను ఆత్మరక్షణలో పడవేశాయి.
పంజాబ్ సీనియర్ బీజేపీ నేత హర్జిత్ గరేవాల్ కంగనా రనౌత్ వ్యాఖ్యల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం మానుకోవాలని కంగనాకు హితువు పలికారు. రైతుల గురించి మాట్లాడే వ్యవహారం కంగనా రనౌత్ పని కాదని, వీటిని ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలుగా పరిగణించాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ రైతులకు అనుకూలమని చెప్పుకొచ్చారు. విపక్ష పార్టీలు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, కంగనా ప్రకటన కూడా అలాగే ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సున్నితమైన, మతపరమైన అంశాలపై ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని సూచించారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు