
వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశ పునాదులను పటిష్ఠం చేసే ఎన్నో విషయాలు 21వ శతాబ్దంలో జరుగుతున్నాయని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావాలని లక్ష మంది యువజనులకు తాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పిలుపు ఇచ్చానని, ఆ పిలుపునకు యువత నుంచి విశేషంగా స్పందన వచ్చిందని తెలిపారు.
యువత క్రియాశీల రాజకీయాల వైపు మొగ్గు చూపుతోందని ప్రధాని వెల్లడించారు. వారికి సరైన అవకాశం, మార్గదర్శనం ఇవ్వవలసిన అవసరం ఉందని ఆయన సూచించారు. రాజకీయ నేపథ్యం ఏమీ లేకుండా యువజనులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని దృఢతరం చేస్తుందని మోదీ చెప్పారు.
అభివృద్ధి చెందిన దేశం, బలమైన ప్రజాస్వామ్యం కోసం నేటి యువత ప్రజా జీవితంలోకి రావాలని ప్రధాని పునరుద్ఘాటించారు. స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. దేశం కోసం వారు తమని తాము పూర్తిగా అంకితం చేసుకున్నారని తెలియజేశారు.
నేడు వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి మనం మరోసారి అదే స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పెద్ద సంఖ్యలో యువత రాజకీయాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వారికి సరైన అవకాశం, మార్గదర్శకత్వం కావాలని తెలియజేశారు. కుటుంబ రాజకీయాలు నూతన ప్రతిభను అణచివేస్తాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.
అంతరిక్ష రంగంలో కృషి చేస్తున్న పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మోదీ ముచ్చటించారు. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా స్పేస్ డే నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాదే ఆగష్టు 23న తొలి అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకొన్నామని చెప్పారు.
అంతరిక్ష రంగంలో భారత్ తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో యువత పెద్ద ఎత్తున లబ్ధి పొందినట్లు వెల్లడించారు.చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ నిలిచిందని గుర్తుచేశారు. అంతరిక్ష రంగంలో వివిధ సంస్కరణల నుంచి దేశ యువత ఎంతగానో లబ్ధి పొందిందని ప్రధాని తెలిపారు.
ఈ సంవత్సరం ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టామని మోదీ తెలిపారు. ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల వద్ద జాతీయ జెండాలు ఆవిష్కరించినట్లు తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సామాజిక వేడుకగా మారిందని పేర్కొన్నారు. తన పిలుపు మేరకు దాదాపు ఐదు కోట్లకు పైగా మంది జాతీయ జెండాతో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసినట్లు వెల్లడించారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు