హిజ్‌బొల్లాపై ఇజ్రాయిల్ వైమానిక ద‌ళం భీక‌ర దాడులు

హిజ్‌బొల్లాపై ఇజ్రాయిల్ వైమానిక ద‌ళం భీక‌ర దాడులు
లెబ‌నాన్‌కు చెందిన హిజ్‌బొల్లాపై ఇజ్రాయిల్ వైమానిక ద‌ళం ఆదివారం భీక‌ర దాడులు చేసింది. ఆ అటాక్ ఆప‌రేష‌న్‌కు చెందిన వీడియోను ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళం రిలీజ్ చేసింది. హిజ్‌బొల్లా ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన కేంద్రాల‌పై దాడి చేసిన‌ట్లు ఐడీఎఫ్ తెలిపింది. తెల్ల‌వారుజామున 5 గంట‌ల‌కు దాడి ప్రారంభ‌మైంది. ఇజ్రాయిల్ ఉత్త‌ర స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఈ దాడి జ‌రిగింది.

ఆ దాడికి చెందిన వీడియోను విడుదల చేశారు. ఆకాశంలోనే యుద్ధ విమానాల్లో ఇంధనం నింపుకున్న వీడియోను కూడా విడుదల చేశారు. ఎఫ్‌35 అదిర్ జెట్స్‌ దాడి మ‌ధ్య‌లో ఇంధ‌నం నింపుకున్నాయి. చాలా క‌చ్చిత‌త్వంతో ఆ విమానాల‌ను శ‌త్రు టార్గెట్ల‌ను ధ్వంసం చేసిన దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి.

“లెబనాన్‌లో మన ఆపరేషన్ ఇజ్రాయెల్ కుటుంబాలను, ఇళ్లను రక్షించడానికి, హిజ్బుల్లా మనకు వ్యతిరేకంగా ఉపయోగించాలని ప్లాన్ చేసిన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని జరిగింది” అని తెలిపింది.  
ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన రీతిలో, చాలా భీక‌రంగా దాడి చేసిన‌ట్లు ప్ర‌ధాని బెంజిమ‌న్ నెత‌న్య‌హూ తెలిపారు. హిజ్‌బొల్లాకు చెందిన వేలాది షార్ట్ రేంజ్ రాకెట్ల‌ను త‌మ ఆప‌రేష‌న్ ద్వారా పేల్చివేసిన‌ట్లు నెత‌న్య‌హూ వెల్ల‌డించారు. ఇజ్రాయిల్‌లోని గ‌లిలీ ప్రాంతంలోని పౌరుల‌ను టార్గెట్ చేశార‌ని, కానీ ఆ దాడిని తిప్పికొట్టిన‌ట్లు నెత‌న్య‌హూ పేర్కొన్నారు. 

సెంట్ర‌ల్ ఇజ్రాయిల్‌పై హిజ్‌బొల్లా వ‌ద‌లిన డ్రోన్ల‌ను ఐడీఎఫ్ ద‌ళాలు నిర్వీర్యం చేసిన‌ట్లు కూడా ఆయ‌న వెల్ల‌డించారు. ద‌క్షిణ లెబ‌నాన్ ప్రాంతంలో వేలాది హిజ్‌బొల్లా మిస్సైళ్ల‌ను వంద‌లాది యుద్ధ విమానాలు ధ్వంసం చేసిట్లు చెప్పారు. ఇంటెలిజెన్స్ స‌మాచారం ప్ర‌కారం ఆ అటాక్ జ‌రిగిన‌ట్లు నెత‌న్య‌హూ తెలిపారు.  దాడుల నేప‌థ్యంలో ఇజ్రాయిల్ 48 గంట‌ల ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. ప్ర‌ధాన విమ‌నాశ్ర‌యాన్ని తాత్క‌లికంగా మూసివేసింది. దీంతో అనేక విమానాల‌ను ర‌ద్దు చేశారు. హిజ్‌బొల్లా త‌న దాడిలో భాగంగా సుమారు 300 ప్రొజెక్టైల్స్‌ను వాడినట్లు తెలుస్తోంది.