కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు

కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. శనివారం ఆయన మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. కేటీఆర్ మహిళా కమిషన్ ఆఫీసుకు వచ్చినప్పుడు హైడ్రామా నడిచింది.
 
బీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి కేటీఆర్ మహిళా కమిషన్ ఆఫీసుకు రాగా బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ మహిళా నేతలు అడ్డుకున్నారు. కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ మహిళా నేతలు తమపై రాళ్ల దాడి చేశారని బీఆర్ఎస్ మహిళా నేతలు ఆరోపించారు. నోటీసులు ఇచ్చి మహిళా కమిషన్ ముందు హాజరవ్వమని దాడి చేస్తారా? అని ప్రశ్నించారు.
 
తెలంగాణ మహిళా కమిషన్‌ ఎదుట శనివారం హాజరైన కేటీఆర్‌ను సోదరుడిగా భావించి కమిషన్‌ సభ్యులు దట్టి, రాఖీలు కట్టారు. ఇటీవలే రాఖీ పండుగ జరగడంతో సోదరుడిగా భావించి కేటీఆర్‌కు ఆరుగురు సభ్యులు రేవతిరావు, అఫ్రోజ్‌ షాహీనా, గజ్జెల పద్మ, ఉమాయాదవ్‌, సూదమ్‌ లక్ష్మి, కొమ్రు ఈశ్వరి రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించారు.
 
మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్‌కు కార్యాలయంలోనే రాఖీ కట్టడంపై కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె ఆదేశం మేరకు కమిషన్‌ కార్యదర్శి ఆ ఆరుగురు సభ్యులకు నోటీసులు జారీచేశారు. అయితే, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద మాత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాఖీపౌర్ణమి రోజు రాఖీ కట్టారని గుర్తు చేస్తున్నారు.
 
కాగా, తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశానని కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు కేటీఆర్ తెలిపారు. గత 8 నెలల్లో మహిళలపై జరిగిన దారుణాలను కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కొరవడిందని, విద్యార్థుల పట్ల లైంగికదాడుల వంటి అంశాలపై కమిషన్‌ వద్ద ప్రస్తావించేందుకు అన్ని వివరాలతో వెళ్లినట్టు వివరించారు.

తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని నేరెళ్ల శారదా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇటువంటి ప్రవర్తన కమిషన్ సభ్యులకు తగనిదని స్పష్టం చేశారు. ఈ చర్యలు మహిళా కమిషన్ గౌరవం, నిష్పాక్షికతను దెబ్బతీస్తుందని విమర్శించారు. మహిళా కమిషన్ తన నిష్పాక్షికతను లేదా న్యాయం పట్ల రాజీపడే ప్రవర్తనను సహించదని స్పష్టం చేశారు.  కమిషన్‌ కార్యాలయంలోకి మొబైల్‌ ఫోన్లు అనుమతించకపోయినా కొందరు రహస్యంగా ఫోన్లు తీసుకెళ్లి రాఖీ కట్టిన వీడియోలు చిత్రీకరించడంపై నేరెళ్ల శారద అభ్యంతరం వ్యక్తం చేశారు.