
`బుల్డోజర్ న్యాయం’ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అనాగరికమని దీనిని వెంటనే ఆపేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేసిన రోజుననే హైదరాబాద్ లో ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేయడం కలకలం రేపుతోంది. అయితే, ఈ కూల్చివేతలు తమ వరకు వచ్చే ప్రమాదముందని కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తున్నది.
మధ్యప్రదేశ్‌లో ఛతార్‌పూర్ జిల్లాలో ఓ నిరసన సందర్భంగా చెలరేగిన హింసలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నివాసాన్ని అక్కడి ప్రభుత్వం కూల్చేసింది. ఈ ఘటనపై శనివారం ‘ఎక్స్’లో ప్రియాంక స్పందిస్తూ ‘ఏదైనా నేరంలో ఎవరైనా నిందితుడిగా ఉంటే, అతడి నేరాన్ని, శిక్షను కోర్టు మాత్రమే నిర్ణయిస్తుంది. ఆరోపణ రాగానే నిందితుడి కుటుంబాన్ని శిక్షించడం, వారికి నిలువ నీడ లేకుండా చేయడం, చట్టాన్ని ఉల్లంఘించడం, ఇంటిని కూలగొట్టడం న్యాయం కాదు. ఇది తీవ్ర అనాగరికం, అన్యాయం’ అని ఆమె మండిపడ్డారు.
కానీ, హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం సహితం అటువంటి `న్యాయాన్ని’ అందించే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. ఎన్ కూల్చివేతతో గండిపేట (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్ చుట్టూ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలోని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేకన్వెన్షన్ భవనం తలు కట్టుకున్న విలాసవంతమైన ఇండ్లు, ఫామ్‌హౌజ్‌లను ఆధారాలతో బయటపెట్టడంతో అధికారపక్ష నేతలు ఉలిక్కిపడుతున్నారు.
ప్రతిపక్ష నేతల ఆస్తులను లక్ష్యంగా చేసుకొని హైడ్రాకు రూపకల్పన చేస్తే, అధికారపక్ష నేతల బండారం బయటపడిందని చెప్పుకుంటున్నారు. హైడ్రా బుల్డోజర్లు వాళ్ల ఇండ్లదాకా వెళ్లే అవకాశాలు కనిపిస్తుండటంతో వారికి దిక్కుతోచడం లేదు. ‘మేమె ఖాళీ చేస్తే.. చెరువులను ఆక్రమించామని ఒప్పుకున్నట్టు అవుతుంది. హైడ్రా అధికారులు వెళ్లి కూల్చితే అక్రమ నిర్మాణాలని అధికారికంగా ప్రకటించినట్టు అవుతుంది. ఏం జరిగినా మేము కూడా దొంగలే అనే ముద్ర తప్పదు’ అని మంత్రులు గాబరా పడుతున్నారు.
‘నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మా భవనాలనూ కూలగొట్టండి’ అని గంభీర ప్రకటనలు చేసిన మంత్రులు సహితం ఇప్పుడు ఆత్మరక్షణలో పడుతున్నారు. కొందరు మంత్రులు, ముఖ్యనేతలు శనివారం ప్రత్యేకంగా సమావేశమై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను పిలిపించుకున్నట్టు తెలుస్తున్నది. చెరువులు, నాలాల ఎఫ్‌టీఎల్ పరిధిలోని నిర్మాణాల వరకు మాత్రమే పరిమితం కావాలని, బఫర్ జోన్‌ను ముట్టుకోవద్దని అల్టిమేటం జారీ చేసినట్టు తెలిసింది.
అయితే, బఫర్ జోన్ పరిధిలో అధికారపక్ష నేతల భవనాలు ఉన్నాయని, వాటిని కూల్చాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తాయని, అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని చెప్పడంతో ఉలిక్కి పడినట్లు చెబుతున్నారు. ఎఫ్‌టీఎల్ వరకే పరిమితం అయితే ఇబ్బంది ఉండదని సూచించినట్టు సమాచారం. మంత్రుల విన్నపంపై సీపీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిసింది.
పైగా, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట) పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం (ఎఫ్‌టీఎల్) నుంచి అర కిలోమీటరు వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని 2007లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జారీచేసిన ఉత్తరువులే ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులకు గుదిబండగా మారుతున్నాయి.
ఇలాఉండగా, రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో రైతుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే కూల్చివేతలు చేపట్టిన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల పట్ల సీఎం అనుచరుల హంగామా కలకలం రేపడంతో ఈ వ్యతిరేకత నుంచి ఇప్పటికిప్పుడు తప్పించుకోవడానికి సీఎం ఎంచుకున్న మార్గమే సినీనటు డు నాగార్జునకు చెందిన ‘ఎన్’ కన్వేషన్‌ను కూల్చివేత అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు