
జార్ఖండ్లో ఒకేసారి ఏకంగా 12,051 మందిపై ఎఫ్ఐఆర్ నమోదయింది. రాంచీలో బీజేవైఎం శనివారం చేపట్టిన ర్యాలీలో పోలీసు సిబ్బందితో పార్టీ కార్యకర్తలు ఘర్షణలకు దిగారనే ఆరోపణలపై ఈ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ నమోదయిన12,051 మందిలో 51 మందికి ఘర్షణల్లో ప్రమేయం ఉందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
కేసులు నమోదైన నిరసనకారుల్లో పార్టీ జార్ఖండ్ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు అమర్ కుమార్ బౌరీ, కేంద్ర మంత్రి సంజయ్ సేథ్, కేంద్ర మాజీ మంత్రి అర్జున్ ముండాతో పాటు పలువురు బీజేపీ ప్రముఖ నాయకులు కూడా ఉన్నారు. ఎఫ్ఐఆర్కు సంబంధించిన వివరాలను రాంచీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) చందన్ కుమార్ సిన్హా మీడియాకు వెల్లడించారు.
‘‘మేజిస్ట్రేట్ వాంగ్మూలం ఆధారంగా శనివారం రాంచీలోని లాల్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఎఫ్ఐఆర్ నమోదయిన వ్యక్తులపై త్వరలో చర్యలు తీసుకుంటాం’’ అని చందన్ కుమార్ సిన్హా తెలిపారు. పోలీసులతో ఘర్షణల్లో ప్రమేయం ఉందని భావిస్తున్న 51 మంది వ్యక్తులతో సహా 12,000 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు అయిందని లాల్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి రూపేష్ కుమార్ సింగ్ తెలిపారు.
ఇదిలావుండగా తమ పార్టీకి చెందిన ప్రముఖ నేతలు మొదలుకొని.. కార్యకర్తలపై ఇంత పెద్ద సంఖ్యలో పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసన చేపట్టింది. జార్ఖండ్లో భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) శుక్రవారం ర్యాలీ నిర్వహించింది. అయితే హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాంచీలో జరిగిన ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసుల తీరుకి నిరసనగా బీజేవైఎం కార్యకర్తలు శనివారం నిరసనకు పిలుపునిచ్చారు. శనివారం అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలు, పోలీసు స్టేషన్ల వద్ద నిరసనలు చేపట్టారు. నిరసన ర్యాలీలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందంటూ నినాదాలు చేశారు. కాగా ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను బద్దలుకొట్టారు. ఈ క్రమంలో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ యువజన విభాగం కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ క్యానన్లు, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించారు.
ఈ ఘర్షణలో పలువురు ఆందోళనకారులు, పోలీసులు గాయపడ్డారు. ఘర్షణ అనంతరం జిల్లా యంత్రాంగం భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023 (బిఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 163ని అమలు చేసింది. ఈ సెక్షన్ మునుపటి సీర్పీసీలోని సెక్షన్ 144 స్థానంలో తీసుకొచ్చింది. ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదరకుండా ఉండేందుకు పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకుంది.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు