స్నాతకోత్సవాల్లో నల్ల గౌన్, టోపీలకు స్వస్తి!

స్నాతకోత్సవాల్లో నల్ల గౌన్, టోపీలకు స్వస్తి!
విద్యాసంస్థల స్నాతకోత్సవాలలో ధరిస్తున్న నల్లటి గౌన్లు, గోపీలను వలసవాద వారసత్వంగా పేర్కొంటూ వీటిని మార్చి వేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కళాశాలలను ఆదేశించింది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వైద్య విద్యను అందించే ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవి ఉన్న రాష్ట్రాల స్థానిక సంప్రదాయాల ఆధారంగా స్నాతకోత్సవాల కోసం తగిన భారతీయ దుస్తుల కోడ్‌లను రూపొందించాలని నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
సంస్థలకు పంపిన లేఖలో, మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన “పంచప్రాణ్” గురించి ప్రస్తావించింది. “బానిస మనస్తత్వాన్ని తొలగించడం”,  “మన సంప్రదాయాల పట్ల గర్వపడాలి” అనే అంశాలను ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు.  ప్రస్తుతం అనుసరిస్తున్న నల్లటి గౌన్, టోపీ ధారణ ఐరోపాలో ఉద్భవించిందని, బ్రిటిష్ వారు తమ వలస రాజ్యాలలో దీనిని ప్రవేశపెట్టారని, దీనిని మార్చాల్సి ఉందని వైద్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
 
ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలపై హింసను అరికట్టడానికి కేంద్ర చట్టం తీసుకు రావడం పట్ల ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా దేశ య్వాప్తంగా చేపట్టిన నిరసనలను సుప్రీంకోర్టు సూచనతో విరమించుకొని విధులకు హాజరవ్వాలని నిర్ణయించుకున్న మరుసటి రోజున ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ లేఖను వ్రాయడం గమనార్హం.
 
కాగా, యూనివర్శిటీ విద్యను నియంత్రించే కేంద్ర సంస్థ అయిన యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ గతంలో అనేక లేఖల ద్వారా — జూలై 15, 2014, జూన్ 7, 2019, జనవరి 16, 2024లలో  చేనేత బట్టలతో తయారు చేసిన వస్త్రాలను స్నాతకోత్సవం వంటి ఉత్సవాల సమయంలో ఉపయోగించడాన్ని పరిగణించాలని విశ్వవిద్యాలయాలకు సూచించింది. 
 
ఇప్పటికే, అనేక విశ్వవిద్యాలయాలు ఇప్పటికే తమ వార్షిక స్నాతకోత్సవాల సందర్భంగా వేడుకల దుస్తులకు చేనేత వస్త్రాలకు మారాయి. “అయితే, కొన్ని విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ స్నాతకోత్సవాల సమయంలో తమ సెరిమోనియల్ డ్రెస్ కోడ్‌ను మార్చుకోలేదని గుర్తించాము” అని కమిషన్ జనవరిలో తన తాజా లేఖలో పేర్కొంది. “చేనేత బట్టల వాడకం భారతీయురాలిగా గర్వించదగ్గ భావాన్ని కలిగించడమే కాకుండా చేనేత పరిశ్రమను ప్రోత్సహిస్తుంది…” అని కమిషన్ పేర్కొంది.