అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) వద్ద ఒక ప్రైవేట్ పారిశ్రామిక యూనిట్‌లో ఆగస్ట్ 21న జరిగిన రియాక్టర్ పేలుడులో 17 మంది కార్మికులు మరణించారని.. మరో 50 మంది గాయపడ్డారని మీడియాలో వచ్చిన వార్తలను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది.

ఈ పేలుడు వెనుక కారణాలు ఇప్పటికీ స్పష్టంగా లేవని, పేలుడు తరువాత‌ శిథిలాల్లో ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా? అని స్టేట్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు వెతుకుతున్నట్లు సమాచారం వ‌చ్చింద‌ని కమిషన్ తెలిపింది. మృతదేహాలు చిక్కుకుపోయి ఉంటాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్టు పేర్కొంది.

పేలుడు జరిగిన సమయంలో ఎంత మంది కార్మికులు విధుల్లో ఉన్నారనే దానిపై స్పష్టత లేదని ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసుల్లో పేర్కొంది. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా బాధితులు జీవించే హక్కు ఉల్లంఘించినట్లు మీడియా నివేదికల్లోని అంశాలు సూచిస్తున్నాయని ఎన్‌హెచ్‌ఆర్సీ అభిప్రాయ‌ప‌డింది. 

పారిశ్రామిక యూనిట్ యజమాని అన్ని భద్రతా నిబంధనలు, చట్టపరమైన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నారా? సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారో? లేదో? తనిఖీ చేయడానికి సమగ్ర దర్యాప్తును ఆదేశిస్తూ ఏపీ సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేస్తున్నామ‌ని స్పష్టం చేసింది. రెండు వారాల్లో వివరణాత్మక స‌మ‌గ్ర‌ నివేదికను సమర్పించాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

సమగ్ర నివేదిక‌లో ఎఫ్‌ఐఆర్ ప‌రిస్థితి, గాయపడిన వారి ఆరోగ్యం, వైద్య చికిత్స, నష్ట  పరిహారం పంపిణీ, గాయపడిన వారితో పాటు చనిపోయిన కార్మికుల కుటుంబాలకు అందించిన ఏదైనా ఇతర ఉపశమనం, పునరావాసంపై వివరాలు సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్సీ సూచించింది. దుర్ఘటనకు బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యల గురించి కూడా నివేదిక‌లో పొందుప‌ర‌చాల‌ని స్పష్టం చేసింది.