ఇస్రో ఉత్పత్తులకు వాణిజ్యపరంగా మంచి డిమాండ్‌

ఇస్రో ఉత్పత్తులకు వాణిజ్యపరంగా మంచి డిమాండ్‌
అంతరిక్ష రంగంలో విస్తృత పరిశోధనలు, నూతన ఆవిష్కరణతో ఆశ్చర్యపరుస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వైపు అమెరికాలోని నాసా సహా ప్రపంచ దేశాలన్నీ దృష్టి సారిస్తున్నాయి. అతి తక్కువ వ్యయంతో అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఇస్రో చేస్తున్న ఆవిష్కరణలు వారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్నాయి. 
 
అయితే రోదసి రంగంలో ప్రయోగాలు, ఆవిష్కరణలకే ఇస్రో పరిమితం కాలేదు. ఇప్పుడది పెట్టుబడికి ఒక సురక్షితమైన ప్రదేశం. దేశానికి ఆదాయాన్ని ఆర్జించిపెట్టే ఒక సాంకేతిక పరిశోధన సంస్థ. వాణిజ్యపరంగా వాటి ఉత్పత్తులకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. ఇస్రోపై ఖర్చు చేసిన ప్రతి రూపాయిపై 2.54 రెట్ల రాబడి వస్తున్నదని ఒక కొత్త నివేదిక సూచిస్తున్నది. 2.54 రెట్ల రాబడి అంటే అద్భుతమైన రాబడి రేటని ఆర్థిక నిపుణులు సైతం పేర్కొంటున్నారు.

దేశంలో బీద, ధనిక తేడా లేకుండా ప్రతి భారతీయుడి జీవితాన్ని ఇస్రో తాకిందని దాని చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్‌ అనూహ్య ప్రగతిని సాధించిందని యూరప్‌లోని నోవాస్పేస్‌కు చెందిన నిపుణుడు స్టీవ్‌ బోచింగర్‌ తెలిపారు. గత 10 ఏండ్లలో ఈ రంగం వాటా భారత ఆర్థిక వ్యవస్థలో 60 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని దీని ద్వారా 47 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగగా, 34 బిలియన్‌ డాలర్లు పన్ను రూపంలో ఆదాయంగా లభించిందని నోవాస్పేస్‌ ఒక నివేదికలో తెలిపింది.

గత 55 ఏండ్లుగా రోదసి రంగంపై భారత్‌ పెట్టిన పెట్టుబడి అమెరికా రోదసీ సంస్థ నాసా ఒక్క ఏడాది బడ్జెట్‌ కన్నా తక్కువని బోచింగర్‌ చెప్పారు. ఇస్రో ప్రస్తుత వార్షిక బడ్జెట్‌ సుమారు 1.6 బిలియన్‌ డాలర్లు కాగా, నాసా వార్షిక బడ్జెట్‌ 25 బిలియన్‌ డాలర్లు. అంటే భారత్‌ బడ్జెట్‌ కన్నా 15.5 రెట్లు ఎక్కువ. 

ఇస్రో రోదసి ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి 2023 డిసెంబర్‌ 31 వరకు 127 భారత ఉపగ్రహాలు ప్రవేశపెట్టింది. ఇందులో ప్రైవేట్‌ సంస్థలు, విద్యాసంస్థలు తయారు చేసినవి కూడా ఉన్నాయి. భారత్‌ ప్రయోగించిన ఉపగ్రహాలలో తక్కువ భూమి కక్ష్యలో ప్రవేశపెట్టినవి 22, జియో సింక్రోనస్‌ ఆర్బిట్‌లోకి పంపినవి 29 ఉన్నాయి. 

వీటికి అదనంగా చంద్రయాన్‌-2, ఆదిత్య-ఎల్‌1, చంద్రయాన్‌-3 లాంటి మూడు లోతైన అంతరిక్ష ప్రయోగాలు కూడా విజయవంతంగా కొనసాగుతున్నాయి. భారత్‌ ఇప్పటివరకు 97 రాకెట్లను, 432 విదేశీ ఉపగ్రహాలను కూడా ఇస్రో వేదికగా ప్రయోగించారు.

వాతావరణం, తుపానుల పర్యవేక్షణ, కమ్యూనికేషన్‌, నావిగేషన్‌, నగర ప్రణాళిక, పంటల విశ్లేషణ, ఏటీఎం వంటి రంగాలను విశ్లేషించగలిగే రూ.50 వేల కోట్ల విలువైన 50 ఉపగ్రహాలను భారత్‌ తయారు చేసింది. అంతేకాకుండా ఇస్రో తయారు చేసిన శాటిలైట్ల వల్ల ప్రతి రోజూ 8 లక్షల మంది జాలర్లకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రతి రోజూ చేసే వాతావరణ హెచ్చరికల ద్వారా 104 కోట్ల మంది భారతీయులకు లబ్ధి చేకూరుతున్నదని నోవాస్పేస్‌ తన నివేదికలో వెల్లడించింది.

భారత శాటిలైట్ల ద్వారా రక్షణ రంగానికి అనూహ్యమైన ప్రయోజనాలు చేకూరుతున్నాయ. భారత దేశ పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో రాత్రి, పగలు నిరంత నిఘా కారణంగా శత్రుదేశాల కదలికలు ఎప్పటికప్పుడు తెలిసిపోతున్నాయి. ఈ నిఘా ఉపగ్రహాలు ఎంత శక్తివంతమైనవి అంటే పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఆ దేశ ప్రధాని ఇంటిలో పార్కు చేసిన కార్ల నెంబర్‌ ప్లేట్ల చిత్రాలను కూడా ఇవి స్పష్టంగా పసిగడతాయి. ఇక అంతర్‌గ్రహ అన్వేషణ రంగంలో భారత్‌ తన తొలి ప్రయత్నంలోనే చంద్రుడు, అంగారక గ్రహాల కక్ష్యను పట్టుకొని చరిత్ర సృష్టించాయి.

దేశ ప్రజలకు మోదీ అభినందనలు

శుక్రవారం మొదటి జాతీయ అంతరిక్ష దినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. రోదసి రంగానికి సంబంధించి తమ ప్రభుత్వం భవిష్యత్తు నిర్ణయాల శ్రేణిని చేపట్టిందని, రాబోయే కాలంలో కూడా ఇది మరింత అధికంగా కొనసాగుతుందని అన్నారు. అంతరిక్ష రంగంలో మనం సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుని, వాటి సాకారానికి కృషి చేసిన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలుపుదామని పేర్కొన్నారు. 

కాగా, బహుళ సంఖ్యలో ఉపగ్రహాల ప్రయోగం కారణంగా అంతరిక్షంలో వ్యర్థాలు పేరుకుపోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. 2030 నాటికి వ్యర్థ రహిత లక్ష్యంగా ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు చేపట్టాలని ఆమె సూచించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా చంద్రయాన్‌-3 మిషన్‌ నుంచి సేకరించిన సైంటిఫిక్‌ డేటాను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది. దీన్ని ప్రదాన్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ పేర్కొన్నారు.

మరోవైపు, అణ్వాయుధ సామర్థ్యం కలిగిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి పృథ్వీ-2 కచ్చితత్వంలో మరోసారి సత్తా చాటింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్‌కు రాత్రి సమయంలో నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. ఒడిసా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి గురువారం రాత్రి 7:46 గంటలకు డీఆర్‌డీవో సీనియర్‌ అధికారుల ఆధ్వరంలో దీన్ని పరీక్షించారు.