అమానుష ఘటన జరిగిన ఆర్‌జికార్ ఆస్పత్రిలోని సెమినార్ హాల్‌లో ఎలాంటి అంతరాయం, అడ్డంకులు లేకుండా నేరం ఎలా జరిగిందనే విషయమై సిబిఐ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. సెమినార్ హాల్ తలుపునకు బోల్ట్ విరిగి వుండడాన్ని గమనించింది. దీనిపై విద్యార్ధులను ప్రశ్నించగా, కొంతకాలంగా బోల్ట్ పనిచేయడం లేదని, దానిపై ఇంతకుముందు కూడా అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు వారు తెలిపారు.
తలుపునకు బోల్ట్ లేనపుడు లోపల బాధితురాలు చేసిన ఆక్రందనలు ఎవరికీ వినిపించలేదా? అని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. పైగా ఎవరూ లోపలకు రాకుండా బయట ఎవరినైనా కాపలాగా పెట్టి వుంటారా? అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. దీన్ని నిర్ధారించుకునేందుకు వారు సిసి టివి ఫుటేజీని సమీక్షిస్తున్నారు.
“సెమినార్ హాల్ డోర్ బోల్ట్ విరిగిపోయింది. నేరం జరుగుతుండగా ఎవరూ లోనికి రాకుండా ఉండేందుకు హాల్ బయట నిల్చొని ఎవరైనా సహకరించారా” అనే కోణంలో విచారణ చేపట్టినట్లు సీబీఐ తెలిపింది. బాధితురాలిని చిత్రహింసలు పెడుతున్న సమయంలో సెమినార్ హాల్ లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవ్వరికీ వినిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని సీబీఐ వ్యాఖ్యానించింది.
9వ తేదీ రాత్రి 2 నుండి 3గంటల మధ్యలో బాధితురాలు సెమినార్ హాల్లోకి ప్రవేశించిందని ప్రాధమిక పరిశీలనలో వెల్లడైంది. సెమినార్ హాల్లో ఆమె పడుకుని వుండగా చూసినట్లు డ్యూటీలో డాక్టరు కూడా తెలిపారు. ఆ రాత్రి హాల్లో పడుకున్నా ఆమె తలుపు వేసుకోకపోవడానికి కారణం బోల్ట్ విరిగి వుండడమేనని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని అక్కడి డాక్టర్లు, ఇంటర్న్‌లు, జూనియర్ డాక్టర్లు తెలిపారని సిబిఐ అధికారులు చెప్పారు.
బాధితురాలితో కలిసి ముందు రోజు రాత్రి డిన్నర్ చేసిన ముగ్గురు జూనియర్ డాక్టర్లు, ఒక ఇంటర్న్‌కు కూడా పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేరంలో వారి పాత్ర వుందా? లేదా? అనేది నిర్ధారించుకోవడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనతో కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ వైద్య కళాశాల విద్యార్థినులు, మహిళా డాక్టర్లు, సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక్కొక్కరు హాస్టళ్లు, కళాశాల ప్రాంగణం వదిలి సొంతూర్లకు వెళ్లడం ప్రారంభించారు. దీంతో ఇప్పుడు లేడీస్ హాస్టళ్లన్నీ ఖాళీగా మారిపోయాయి. గతంలో క్యాంపస్ హాస్టళ్లలో 160 మంది మహిళా జూనియర్ డాక్టర్లు ఉండగా, ఇప్పుడు 17 మంది మాత్రమే ఉన్నారని, నర్సింగ్ హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి ఉందని విద్యార్థులు చెప్తున్నారు.

More Stories
ఢిల్లీలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్ .. భారీ ఉగ్రకుట్ర భగ్నం
పంజాబ్ ప్రభుత్వ పాఠశాల గోడపై ఖలిస్థాన్ నినాదాలు
సంతాప తీర్మానంలో విమర్శలపై బిజెపి అభ్యంతరం