
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరినట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయం, వైద్యం, సంస్కృతి, మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మోదీ ఉక్రెయిన్ పర్యటన ఓ మైలురాయిగా నిలుస్తుందన్న విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చెప్పారు.
ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ, ఔషధ, వ్యవసాయం, విద్య రంగాల్లో సహకారంపై మోదీ, జెలెన్‌స్కీ చర్చించినట్లు పేర్కొన్నారు జైశంకర్. ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించి కూడా ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగినట్లు వెల్లడించారు.
శాంతిని పునరుద్ధరించేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ సుముఖంగా ఉందని మోదీ పునరుద్ఘాటించనట్లు పేర్కొన్నారు. రెండు రోజుల పోలండ్ పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ, 10 గంటలు ప్రయాణించి ఉక్రెయిన్ చేరుకున్నారు. అక్కడి భారత సంతతి ప్రజలు రైల్వేస్టేషన్ వద్ద మోదీకి ఘన స్వాగతం పలికారు.
అనంతరం రాజధాని కీవ్‌లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు. ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు.
“అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి అమరుల స్మారకం వద్ద నివాళి అర్పించాం. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం చిన్నారులకు వినాశకరమైంది. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దుఃఖం నుంచి బయటపడే మనోధైర్యాన్ని వారికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నా” అని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, కీవ్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమన్న ఆయన, కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో గాంధీకి నివాళులు అర్పిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు.
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి