
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలో వెల్లువెత్తిన నిరసనలకు బంగాల్ ప్రభుత్వం తలొగ్గింది. ఆర్జీ కర్ ఆసుపత్రిలోని ముగ్గురు సీనియర్ అధికారులను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు బంగాల్ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్ ఉత్తర్వులు జారీ చేశారు. వారిని, వివిధ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేసినట్లు వెల్లడించారు.
దీంతోపాటు జూనియర్ వైద్యురాలి మృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, బదిలీ అయిన ఆర్జీ కర్ వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు నిగమ్ ప్రకటించారు.
“వైద్యురాలి హత్యాచార ఘటనపై గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల డిమాండ్ల మేరకు పలు చర్యలు చేపట్టాం. ప్రస్తుత పరిస్థితి సాధారణ స్థితికి రావాలని కోరుతున్నాం. డాక్టర్లు వైద్యసేవలు కొనసాగించాలని కోరుతున్నాం. డాక్టర్ల డిమాండ్ల మేరకు ఆస్పత్రిలో భద్రతను కట్టుదిట్టం చేశాం” అని ఎన్‌ఎస్ నిగమ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ ఘోష్ నియామకాన్ని బెంగాల్ ఆరోగ్య శాఖ రద్దు చేసింది. ఆర్జీ కర్ ప్రస్తుత ప్రిన్సిపల్ సుహ్రితా పాల్‌ను, బరాసత్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా బదిలీ చేసింది. ఆమె స్థానంలో మానస్ కుమార్ బంధోపాధ్యాయ నియమించింది.
ఆర్జీ కర్ ఆసుపత్రి వైస్ ప్రిన్సిపాల్, మెడికల్ సూపరింటెండెంట్ బుల్బుల్ ముఖోపాధ్యాయ స్థానంలో సప్తర్షి ఛటర్జీని నియమిస్తూ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆర్‌జీకేఎంసీహెచ్ ఔషధ విభాగాధిపతి అరుణాభ దత్తా చౌధురిని, మాల్దా మెడికల్ కాలేజీకి బదిలీ చేసింది.
కాగా, వైద్యురాలి అత్యాచారాలను వ్యతిరేకిస్తూ బుధవారం సాయంత్రం క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగులీ కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన భార్య డోనా, కుమార్తె సనాచో కలిసి పాల్గొన్నారు. నల్ల దుస్తులు ధరించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా గంగులీ భార్య డోనా మాట్లాడుతూఈ నిరసనలో ప్రతి ఒక్కరు భాగం కావాలని కోరుకుంటారని, ఈ రోజు వారు స్వచ్ఛందంగా ముందుకువచ్చారని చెప్పారు. ఆరోగ్యకర వాతావరణం ఉండే సమాజాన్ని చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరు సమానమే, అందరికీ భద్రత కల్పించాలని ఆమె స్పష్టం చేశారు. కేవలం డాక్టర్లకే కాదు, సమాజంలో అన్నివర్గాల మహిళలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
More Stories
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్