అనకాపల్లిలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్.. 17 మంది మృతి

అనకాపల్లిలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్.. 17 మంది మృతి
* ప్రధాని మోదీ దిగ్బ్రాంతి … నేడే చంద్రబాబు పర్యటన
ఏపీలోనిఅనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. బుధవారం  మధ్యాహ్నం భోజన విరామ సమయం రియాక్టర్‌ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమ ఆవరణమంతా దట్టంగా పొగలు అలముకున్నాయి. 500 కిలో లీటర్ల సామర్థ్యం గల రియాక్టర్ పేలింది. 
ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు సమయంలో 387 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. కార్మికులు షిఫ్టు మారే సమయంలో ప్రమాదం జరిగింది. అనకాపల్లి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు సంభవించి 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ హ్యాండిల్‌లో మోదీ సందేశంలో సంతాపం తెలిపారు. 
అనకాపల్లిలోని ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం, సన్నిహితులను, ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తదుపరి వారికి ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి నుండి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది. క్షతగాత్రుల ప్రతి ఒక్కరికీ 50,000 రూపాయలు ఇవ్వబడుతుంది” అని ప్రకటించారు.

పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమైపోయాయి. మృతదేహాలను అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంటనే అప్రమత్తమైన ఫార్మా సిబ్బంది బాధితులను అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. రియాక్టర్‌ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.

రియాక్టర్ పేలుడు ఘటనతోకార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫార్మా సెజ్లోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. 

రియాక్టర్‌ పేలుడు ధాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు శ్లాబు కూలిపోయిందని, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు కార్మికులు చెబుతున్నారు. మూడో అంతస్తులో చిక్కుకున్న కార్మికులను క్రేన్‌ సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతన్నాయి.

అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం అచ్యుతాపురానికి చంద్రబాబు వచ్చి ఫార్మా కంపెనీ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు పరామర్శించనున్నారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం ఆదేశించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రియాక్టర్ పేలుడు ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడారు. తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రమాదంపై గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్‌ పేలి పలువురు కార్మికులు మృతిచెందడం బాధాకరమని చెబుతూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రియాక్టర్‌ పేలుడు ఘటన దురదృష్టకరమని కార్మికశాఖ మంత్రి సుభాష్ పేర్కొన్నారు.