పిల్ల‌లు, మ‌హిళ‌ల న‌గ్న వీడియోలు.. అమెరికాలో భార‌తీయ డాక్ట‌ర్ అరెస్టు

పిల్ల‌లు, మ‌హిళ‌ల న‌గ్న వీడియోలు.. అమెరికాలో భార‌తీయ డాక్ట‌ర్ అరెస్టు
భార‌తీయ సంత‌తికి చెందిన 40 ఏళ్ల డాక్ట‌ర్ ఒమ‌ర్ అయిజాజ్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 16 కోట్ల బాండ్‌పై అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. అత‌నిపై లైంగిక వేధింపుల కేసులు న‌మోదు అయ్యాయి. పిల్ల‌లు, మ‌హిళ‌ల‌కు చెందిన న‌గ్న వీడియోల‌ను తీసిన‌ట్లు ఆ డాక్ట‌ర్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 
 
అత‌ని వ‌ద్ద వంద‌ల సంఖ్య‌లో వీడియోలు, ఇమేజ్‌లు ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఆగ‌స్టు 8వ తేదీన ఒమ‌ర్ అయిజాజ్‌ను అరెస్టు చేశారు.  తన దగ్గరకు వైద్యానికి వచ్చిన మహిళలు, చిన్నారులను స్పృహ లేని సమయం చూసి అభ్యంతరకర దృశ్యాలను రికార్డు చేసేవాడు. గత కొన్నేళ్లుగా తాను పనిచేస్తున్న ఆసుపత్రుల్లో రహస్య కెమెరాలతో వీడియోలను చిత్రీకరించాడు. 
 
ఎట్టకేలకు భార్య ఫిర్యాదుతో అతడి అరాచకాలు వెలుగులోకి రావడంతో ఇటీవల ఆక్లాండ్‌ కౌంటీ పోలీసులు అరెస్టు చేశారు. భారత్‌కు చెందిన ఒయిమెయిర్‌ ఎజాజ్‌ 2011లో వర్క్‌ వీసాపై అమెరికాకు వెళ్లాడు. తొలుత కొన్నేళ్ల పాటు అలబామాలో నివాసమున్న అతడు 2018లో మిషిగాన్‌కు మకాం మార్చాడు. ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని పలు ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నాడు. 
 
అయితే, గత కొన్నేళ్లుగా అతడు లైంగిక దారుణాలకు పాల్పడ్డాడు. తాను పనిచేసే చోట ఆసుపత్రి గదులు, బాత్రూమ్‌లు, చేజింగ్‌ ఏరియా వంటి ప్రదేశాల్లో రహస్యంగా కెమెరాలు పెట్టి అనేక మంది మహిళలు, చిన్నారుల నగ్న వీడియోలను రికార్డ్‌ చేశాడు. ఆసుపత్రుల్లో రోగులను కూడా లైంగికంగా వేధించేవాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. 
 
ఇటీవల అతడి భార్యకు ఈ విషయం తెలియడంతో ఆ వీడియోలను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగస్టు 8న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం అతడి ఇంటిని సోదా చేయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అతడి నివాసంలో ఓ కంప్యూటర్‌, ఫోన్లు, 15 ఎక్స్‌టర్నల్‌ స్టోరేజీ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అందులో వేలాదిగా వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. 
 
ఒక సింగిల్‌ హార్డ్‌ డ్రైవ్‌లో 13వేల వీడియోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్లౌడ్ స్టోరేజ్‌లోనూ ఈ దృశ్యాలను అప్‌లోడ్‌ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అతడిపై నేరాభియోగాలు మోపి జైలుకు పంపించారు. అతడి బాధితుల సంఖ్య చాలా ఎక్కువ ఉందని, దీనిపై పూర్తిగా దర్యాప్తు చేసేందుకు కొన్ని నెలలు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.