డెమోక్ర‌టిక్ పార్టీ సదస్సులో పూజారి రాకేశ్ భ‌ట్‌ వేద ప‌ఠ‌నం

డెమోక్ర‌టిక్ పార్టీ సదస్సులో పూజారి రాకేశ్ భ‌ట్‌ వేద ప‌ఠ‌నం

అమెరికాలోని చికాగోలో జరుగుతున్న డెమోక్ర‌టిక్ పార్టీ జాతీయ స‌మావేశాలలో  మూడ‌వ రోజు భార‌తీయ సంత‌తికి చెందిన పూజారి రాకేశ్ భ‌ట్‌ వేద ప‌ఠ‌నంతో స‌మావేశాల‌ను ప్రారంభించారు. భిన్న‌త్వం ఉన్నా దేశం కోసం ఒక్క‌టిగా ఉండాల‌న్న సంస్కృత శ్లోకాన్ని ఆయ‌న వినిపించారు. ఐక్యంగా ఉంటేనే ప్ర‌జ‌లంద‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌ని పూజారి రాకేశ్ భ‌ట్ త‌న ప్ర‌వ‌చ‌నంలో తెలిపారు. 

మ‌నం ఒక్క‌టిగా ఉండాల‌ని, మ‌న మెద‌ళ్లు ఒకేర‌కంగా ఆలోచించాల‌ని, మ‌న గుండెలు కూడా ఒకేలా కొట్టుకోవాల‌ని, ఇది స‌మాజ హితం కోసం జ‌ర‌గాల‌ని, దేశాన్ని గ‌ర్వంగా నిలుపాల‌ని పూజారి రాకేశ్ భ‌ట్ కోరుకున్నారు. రాబోయే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థిగా భార‌తీయ సంత‌తికి చెందిన క‌మ‌లా హ్యారిస్ పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే. 

ఇక ఆ పార్టీ త‌ర‌పున ఉపాధ్య‌క్షుడిగా టిమ్ వాల్జ్ నామినేష‌న్ స్వీక‌రించారు. అయితే డెమోక్ర‌టిక్ పార్టీ క‌న్వెన్ష‌న్‌లో పూజారి రాకేశ్ భ‌ట్ శ్లోకాలు ప్ర‌త్యేకంగా నిలిచాయి. మేరీల్యాండ్‌లోని శ్రీ శివ విష్ణు ఆల‌యంలో ఆయ‌న పూజ‌లు చేస్తుంటారు.

డెమొక్రాటిక్ పార్టీ డిప్యూటీ నేషనల్ ఫైనాన్స్ చైర్ అజయ్ భూటోరియా మాట్లాడుతూ, “ఈరోజు డెమోక్రాటిక్ పార్టీ సదస్సులో రాకేష్ భట్ హిందూ ప్రార్థన ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది డెమోక్రటిక్ పార్టీ సమగ్రత, వైవిధ్యం పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తుంది.” అని చెప్పారు. “ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఇంత ప్రముఖ వేదికపై గౌరవించబడటం హృదయపూర్వకంగా ఉంది. ఈ క్షణం అమెరికన్ సమాజంలో పెరుగుతున్న మా  ప్రభావాన్ని, గుర్తింపును ప్రతిబింబిస్తుంది” అని భూటోరియా చెప్పారు.

మ‌ద్వాచారి అయిన ఆయ‌న‌ది బెంగుళూరు. రుగ్వేదం, తంత‌శాస్త్రంలో రాకేశ్ భ‌ట్ పండితుడు. మ‌నం అంతా వ‌సుదైక కుటుంబం అని, స‌త్య‌మే అన్నింటికి ఫౌండేష‌న్ అని, అదే మ‌న‌ల్ని అవాస్త‌వం నుంచి వాస్త‌వం వైపు, చీక‌టి నుంచి వెలుతురు వైపు, మ‌ర‌ణం నుంచి అమ‌ర‌త్వం వైపు తీసుకెళ్లుతుంద‌ని భ‌ట్ తెలిపారు. 

పూజారి రాకేశ్ భ‌ట త‌మిళం, తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, ఇంగ్లీష్‌, తులు, సంస్కృత భాషాల్లో నిష్ణాతుడు. సంస్కృతం, ఇంగ్లీష్‌, క‌న్న‌డ భాష‌ల్లో ఆయ‌న‌కు మాస్ట‌ర్స్ డిగ్రీ ఉన్న‌ది. ఉడిపిలోని అష్టామ‌ఠంలో కొన్నాళ్లు ప‌నిచేశారు. బ‌ద్రీనాథ్‌, సేలంలోని రాఘ‌వేంద్ర స్వామి ఆల‌యంలో ప‌నిచేశారు.