కోల్‌కతా హత్యాచార ఘటనలో ‘క్రైమ్​ సీన్​ని మార్చేశారు’

కోల్‌కతా హత్యాచార ఘటనలో  ‘క్రైమ్​ సీన్​ని మార్చేశారు’
* తక్షణమే విధుల్లో చేరాలని వైద్యులకు సుప్రీం సూచన
 
కోల్​కతాలోని ఆర్​జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్​పై అత్యాచారం, హత్య కేసు ఘటనలో  క్రైమ్ సీన్​ని మార్చారని, తొలుత ఇది ఆత్మహత్య అని తల్లిదండ్రులకు పశ్చిమ్​ బెంగాల్​ పోలీసులు చెప్పారని, ఆ తర్వాత హత్య అని వెల్లడించినట్టు సీబీఐ తన స్టేటస్ రిపోర్టులో పేర్కొంది. సీబీఐ గురువారం తన స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది.
 
 అత్యాచారం, హత్యా కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సీబీఐ తన రిపోర్టులో పేర్కొంది. తల్లిదండ్రులను సైతం తప్పుదారి పట్టించారని తెలిపింది. శవ దహనం తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సీబీఐ పేర్కొంది. ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని వెల్లడించింది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ స్టేటస్‌కో రిపోర్టును కోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందించారు.
 
ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని వెంటనే విధుల్లో చేరాలని సూచించింది. విధుల్లోకి చేరిన తర్వాత వారిపై అధికారులు చర్యలు తీసుకోకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చింది. వైద్యులు విధులు నిర్వర్తించకపోతే రోగులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని కోర్టు వ్యాఖ్యానించింది. వైద్యుల ఆందోళనతో పేదలు నష్టపోకూడదని పేర్కొంది.
 
సిజేఐ డివై చంద్ర చూడ్ ధర్మాసనం సీబీఐ రిపోర్టును పరిశీలించింది.  ఘటన జరిగిన 5వ రోజు దర్యాప్తు రిపోర్టు తమ చేతికి అందిందని కోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. అప్పటికే చాలా వరకూ మార్చేశారని వెల్లడించారు. అయితే ప్రతి ఒక్కటీ వీడియోగ్రఫీ జరిగిందని బెంగాల్ ప్రభుత్వం తరుఫున కపిల్ సిబల్ తెలిపారు. మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సొలిసిటర్ జనరల్ తెలిపారు.
 
సీనియర్ డాక్టర్లు, సహచరులు ఒత్తిడి చేయడంతోనే వీడియోగ్రఫీ చేశారని పేర్కొన్నారు. అంటే అక్కడ కవర్-అప్ ఏదో జరుగుతుందని వారంతా భావించారని సొలిసిటర్ జనరల్ వెల్లడించారు. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారంటూ కోల్‌కతా ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ విషయంలో నిబంధనలు పాటించలేదని, ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారంటూ కోర్టు అభిప్రాయపడింది. 
 
30 ఏళ్లలో ఇలాంటి కేసు చూడలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్థివాలా పేర్కొన్నారు. కేసు డైరీ హార్డ్ కాపీ సమర్పించాలని కోల్‌కతా పోలీసులను సుప్రీంకోర్టు కోరింది. ఘటన జరిగిన చాలాసేపు తర్వాత కేసు నంబరు నమోదు చేసినట్లు తెలుస్తోందని కోర్టు పేర్కొంది.

“మృతురాలికి ఆగస్టు 9న సాయంత్రం 6.10 నుంచి 7.10 గంటల మధ్య పోస్టుమార్టం నిర్వహించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. 9వ తేదీ సాయంత్రం 6.10 గంటలకు పోస్టుమార్టం నిర్వహించిన తరువాత మృతదేహాన్ని అంత్యక్రియలకు కోసం రాత్రి 9 గంటలకు కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరి, రాత్రి 11.30 గంటలకు పోలీసు స్టేషన్‌లో వైద్యురాలిది అసహజ మరణం అని ఎలా నిర్థరించారు. ఇది ఆందోళన కలిగించే అంశం. ఘటనపై మొదటి ఎంట్రీని నమోదు చేసిన కోల్‌కతా పోలీసు అధికారి తదుపరి విచారణకు హాజరు కావాలి” అని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో కోల్‌కతా పోలీసులు పనిచేసిన తీరు సరికాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించలేదని, వారి చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని తెలిపారు. ఈ కేసు చాలా షాకింగ్‌గా ఉందన్న న్యాయస్థానం సీబీఐ, కోల్‌కతా పోలీసుల నివేదికల మధ్య ఎందుకు వ్యత్యాసం ఉందని ప్రశ్నించింది. 
 
ఈ కేసు విచారణ సందర్భంగా ప్రయివేట్ ఆసుపత్రులు సొంతంగా రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంది. ప్రయివేట్ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యుల భద్రతను ఆసుపత్రుల యాజామాన్యాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 
 
మరోవైపు వైద్యుల భద్రతపై కేంద్రప్రభుత్వం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతపై ఓ మెకానిజాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వైద్యులకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల భద్రతపై తగిన చర్యలు చేపట్టాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈకేసు తుది విచారణ సెప్టెంబర్5న జరగనుంది.