రైల్వే ప్రమాదాల నివారణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

రైల్వే ప్రమాదాల నివారణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
దేశంలో పెరిగిపోతున్న రైలు ప్రమాదాల నివారణకు రైల్వే బోర్డు కీలక ప్రణాళికను ప్రకటించింది. రైళ్ల ప్రమాదాల నివారణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో కూడిన సీసీటీవీ కెమెరాలను బిగించనున్నట్టు రైల్వే బోర్డు చైర్ పర్సన్, సీఈవో జయవర్మ సిన్హా ప్రకటించారు.
 
ప్రయాగ్ రాజ్ రైల్వే జంక్షన్ లో వచ్చే ఏడాది కుంభ మేళ ఏర్పాట్ల పైన మాట్లాడిన జయవర్మ సిన్హా అన్ని రైళ్లు, కీలకమైన అన్ని రైల్వే యార్డుల వద్ద ఏఐతో పనిచేసే సీసీటీవీ కెమెరాలను బిగించనున్నట్టు వెల్లడించారు. ఏఐ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలు అసాధారణ పరిస్థితులను గుర్తిస్తాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. రైల్వే భద్రతా చర్యలను మెరుగుపరచడంలో ఈ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక రైల్వే ట్రాక్ భద్రత పైన మాట్లాడుతూ వచ్చే సంవత్సరం కుంభమేళా నేపథ్యంలో సంఘ విద్రోహులు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా రైల్వే ట్రాక్ల పైన భద్రతా సంస్థలు నిరంతర నిఘా ఏర్పాటు చేస్తాయని ఆమె స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం కుంభమేళా ప్రారంభానికి ముందే రైల్వే కి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు, విస్తరణ ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
కుంభమేళాకు 900 ప్రత్యేక రైళ్ళు 2025 లో జరిగే కుంభమేళా కోసం దాదాపు 900 ప్రత్యేక రైళ్ళు నడపనున్నామని ప్రకటించిన ఆమె 2019 కుంభమేళా సందర్భంగా 530 ప్రత్యేక రైలు నడిపామని గుర్తు చేశారు. ఈసారి కుంభమేళాకు 30 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామ,ని అత్యవసర పరిస్థితులలో రద్దీ నివారణ కోసం అవసరమైన ప్రణాళికలను రూపొందించి ముందుకు వెళతామని ఆమె పేర్కొన్నారు.

ఇక ప్రయాగ్ రాజ్ జంక్షన్ ను అమృత భారత్ స్టేషన్ గా ఎంపిక చేశామని, ఆ దిశగా ఆధునీకరణ జరుగుతుందని ఆమె తెలిపారు. దేశంలో ఇటీవల కాలంలో జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్న ఆమె రైలు ప్రమాదాలు జరగకుండా ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రమాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. మరింత అడ్వాన్స్ టెక్నాలజీ తో రైలు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని వివరించారు.