
న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా చెప్పాలని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు కుప్పకూలాయని ఆరోపిస్తూ కలకత్తా పోలీస్ చీఫ్‌ను తొలగించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు.
వక్రబుద్ధితో ఒక యువ వైద్యురాలిపై హత్యాచారం చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. దీన్ని రాజకీయ సమస్యగా చేయకూడదనుకుంటున్నానని చెప్పారు. తల్లిదండ్రులు వైద్యురాలి మృతదేహం చూసేందుకు 3 గంటలు వేచి ఉన్నారని పేర్కొన్నారు.
నిరసనలను అణిచివేసేందుకు బలప్రయోగం చేయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై మేం ఆందోళన చెందుతున్నామని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ప్రభుత్వం బలప్రయోగం చేయకూడదని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆర్‌జి కర్ ఆసుపత్రిలో అర్ధరాత్రి విధ్వంసాన్ని ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోని కీలకమైన మౌలిక సదుపాయాలను ఒక గుంపు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
‘తెల్లవారుజామున నేరం బయటపడిన తరువాత, ప్రిన్సిపాల్ దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. బాధితురాలి తల్లిదండ్రులను మృతదేహాన్ని చూడటానికి కూడా అనుమతించలేదు. రాత్రి పొద్దుపోయే వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎఫ్ఐఆర్‌ను ఆలస్యం చేయడం సరికాదు’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు.
డాక్టర్లు, మహిళా వైద్యుల భద్రత జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశం. చర్యలు తీసుకోండి. దేశం మరో అత్యాచారం కోసం వేచి ఉండదు. ఆరోగ్య కార్యకర్తలను రక్షించడానికి రాష్ట్రంలో చట్టాలు ఉన్నాయి, కానీ అవి వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించవు.’ అని ఆయన తెలిపారు.
ట్రైనీ డాక్టర్ శరీరాన్ని ఆమె పేరెంట్స్‌కు అప్పగించడంలో ఎందుకు జాప్యం చేశారని బెంగాల్ సర్కార్‌ను కోర్టు ప్రశ్నించింది. ఈ కేసును విచారించడంలోనూ బెంగాల్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కోర్టు చెప్పింది. ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసును బెంగాల్ ప్రభుత్వం సరైన రీతిలో నియంత్రించలేకపోయిందని, ఆస్పత్రిలో జరిగిన విధ్వంసాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సీజీఐ చంద్రచూడ్ వెల్లడించారు.
విచారణ సందర్భంగా జూనియర్, సీనియర్ డాక్టర్ల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, డాక్టర్ల సమ్మెతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొంది. ఈ మేరకు వైద్యులు వెంటనే సమ్మె విరమించి తమ విధుల్లోకి చేరాలని కోరింది. ‘వైద్యులందరి భద్రత, సంక్షేమానికి సంబంధించిన విషయాలను కోర్టు పరిశీలిస్తున్నందున.. ప్రస్తుతం విధులకు దూరంగా ఉన్న వైద్యులు వీలైనంత త్వరగా తిరిగి విధుల్లోకి చేరాలని మేము కోరుతున్నాము’ అని సుప్రీం ధర్మాసనం తెలిపింది.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!