వైద్యురాలి హత్యాచార నిందితుడికి లై నేడే డిటెక్టర్ టెస్ట్‌!

వైద్యురాలి హత్యాచార నిందితుడికి లై నేడే డిటెక్టర్ టెస్ట్‌!
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ విన్నపానికి కలకత్తా హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో నిందితుడు సంజయ్ రాయ్‌కు మంగళవారం లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించనున్నట్లు సమాచారం. 
 
ఆగస్ట్‌ 9న ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నైట్‌ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. హాస్పిటల్ సెమినార్ హాల్‌లో జూనియర్‌ వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడు సంజయ్ రాయ్ ని డీఎన్ఏ ఆధారాలు పోస్ట్ మార్టం నివేదికలోని మృతురాలి గోళ్ళలో ఉన్న రక్తం, చర్మ ఆధారాలతో సరిపోలాయని దర్యాప్తు అధికారులు నివేదికల ఆధారంగా గుర్తించారు. అతడి మానసిక స్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా, ఆ హాస్పిటల్‌లో వాలంటీర్‌గా పని చేస్తున్న సంజయ్ రాయ్‌ను నిందితుడిగా అనుమానించి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నేరం జరిగిన రోజు రాత్రి 11 గంటల సమయంలో మద్యం సేవించడానికి ఆసుపత్రి వెనుక ఉన్న ప్రదేశానికి అతడు వెళ్లాడు. అక్కడ మద్యం సేవిస్తూ పోర్న్ చూసేవాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరోవైపు అదే రోజు రాత్రి సంజయ్ రాయ్‌ చాలాసార్లు ఆసుపత్రి ప్రాంగణంలోకి ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. నేరం చేసిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి అతడు ప్రయత్నించినట్లు చెప్పారు. సంఘటనా స్థలంలోని రక్తం మరకలను కడిగేందుకు సంజయ్‌ రాయ్‌ ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఉదయం 4:45 గంటలకు సెమినార్ గది నుంచి అతడు బయటకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిర్ధారించారు.

కాగా, బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ కలకత్తా హైకోర్టు న్యాయవాదులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కేసులోని అన్ని కోణాలను సిబిఐ విచారించాలని న్యాయవాది నరేంద్ర కోరారు.

వరుసగా నాల్గవ రోజైన సోమవారం కూడా సిబిఐ అధికారులు ఆర్‌జికార్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ను ప్రశ్నించారు. శుక్ర, శనివారాల్లో అర్ధరాత్రి వరకు అనేక గంటల పాటు విచారణ సాగింది. ఈ హత్యను ఆత్మహత్య అని డిక్లేర్‌ చేయడానికి ఎందుకు అంత తొందరపడ్డారు?, మీరు కూడా డాక్టరే కదా, సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాలు సురక్షితంగా వుంచాలని మీకు తెలియదా? నేరమని తెలిసి కూడా అవన్నీ తారుమారు కావడానికి ఎలా అనుమతించారు?  అంటూ పలు ప్రశ్నలను సిబిఐ అధికారులు వేశారు.