ఓబీసీలపై కాంగ్రెస్‌ కపట ప్రేమ

ఓబీసీలపై కాంగ్రెస్‌ కపట ప్రేమ
* కాంగ్రెస్, జెడియు, ఎల్జేపీల వ్యతిరేకత
లేటరల్ ఎంట్రీ ద్వారా రిజర్వేషన్లకు మోదీ సర్కార్‌ తూట్లు పొడుస్తున్నదని విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ లోక్‌సభలో విపక్ష నేతని, ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నారని, బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం ఆయనకు తగదని ఆక్షేపించారు. 
 
లేటరల్‌ ఎంట్రీ ద్వారా ఆరెస్సెస్‌ వ్యక్తులను ఉన్నత పదవుల్లో నియమిస్తారని రాహుల్‌ గాంధీ చెప్పడం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.  డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ సైతం లేటరల్‌ ఎంట్రీలో భాగమేనని గుర్తుచేశారు. 1976లో మీరు ఆయనను నేరుగా ఆర్ధిక శాఖ కార్యదర్శిగా ఎలా నియమించారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. 

మీ ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ కూడా లేటరల్‌ ఎంట్రీలో భాగమేనని చెప్పారు. ఇలాంటి వందలాది ఉదాహరణలు కనిపిస్తాయని, లేటరల్‌ ఎంట్రీని తీసుకొచ్చిందే మీరని రాహుల్‌ను ఉద్దేశించి కేంద్ర మంత్రి పేర్కొన్నారు. లేటరల్‌ ఎంట్రీని మీరు ప్రారంభిస్తే దాన్ని మోదీ క్రమబద్ధీకరణ చేశారని చెప్పారు.2005లో పరిపాలనా సంస్కరణల కమిషన్‌ ఏర్పాటైందని, దాని నివేదిక బయటకువచ్చిందని తెలిపారు. 2005 నుంచి యూపీఏ అధికారంలో ఉందని గుర్తుచేశారు. తాము రిజర్వేషన్లకు చరమగీతం పాడతామని చెబుతున్నారని, అసలు మీరు ఎప్పుడు నియామకాలు చేపట్టారని మీరు ఏం చేశారని కేంద్ర మంత్రి నిలదీశారు. 

కాంగ్రెస్‌కు హఠాత్తుగా ఓబీసీలపై ప్రేమ పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ స్వయంగా తాను ఓబీసీ రిజర్వేషన్‌కు వ్యతిరేకమని చెప్పారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్‌కు ఓబీసీలపై ప్రేమ పుట్టుకొచ్చిందని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్ధులను కాంగ్రెస్‌ తప్పుదారిపట్టిస్తోందని కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్ దుయ్యబట్టారు.

మరోవంక, వివిధ మంత్రిత్వ శాఖల్లో పోస్టులను లేటరల్‌ ఎంట్రీ విధానంలో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించడంపై ఎన్‌డీయేలో విభేదాలు తలెత్తాయి. ఈ విధానాన్ని బీజేపీ మిత్ర పక్షాలైన జేడీయూ, లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ-రాం విలాస్‌) వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తప్పనిసరి అని, ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఎల్‌జేపీ నాయకుడు, కేంద్ర మంత్రి చిరాగ్‌ పాసవాన్‌ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా దీనిని తగిన వేదికపై ప్రస్తావిస్తానని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ఆందోళన కలిగించే విషయమని జేడీయూ జాతీయ అధికార ప్రతినిధి కేసీ త్యాగి పేర్కొన్నారు.

కాగా, ప్రభుత్వంలో నిపుణులను నియమించడానికి మోదీ ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకురావట్లేదని, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల హక్కులను హరించడానికి చేస్తున్న ప్రయత్నమని ‘ఎక్స్‌’ ద్వారా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ట్వీట్‌ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి బదులుగా గత దశాబ్ద కాలంలో ఆ సంస్థలలోని వాటాలను మోదీ ప్రభుత్వం అమ్మడం వల్ల 5.1 లక్షల ఉద్యోగాలు గల్లంతయ్యాయని విమర్శించారు. 
 
బీజేపీ పాలనలో తాత్కాలిక, ఒప్పంద నియామకాలు 91 శాతం పెరిగాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు కేటాయించిన ఈ ఉద్యోగాలను ఇప్పుడు ఆర్‌ఎ్‌సఎస్‌ వారికే ఇస్తున్నారని విమర్శించారు. ఇది రిజర్వేషన్లను బలహీనపరిచేందుకు, రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడ అని ఖర్గే ఆరోపించారు.