
లేటరల్ ఎంట్రీ విధానంపై కేంద్ర ప్రభుత్వంవెనక్కి తగ్గింది. వివిధ రంగాల నిపుణులకు ప్రభుత్వంలోని ఆయా విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించే పద్ధతినే లేటరల్ ఎంట్రీ అంటారు. అయితే తాజాగా దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనకడుగు వేసింది. తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేయాలంటూ యూపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది.
ఉన్నత ఉద్యోగాల్లో లేటరల్ ఎంట్రీపై సంయుక్త కార్యదర్శులు, ఉప కార్యదర్శులు/ డైరెక్టర్ల నియామకానికి నియమాక ప్రకటనను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సూదన్కు లేఖ రాశారు. ప్రభుత్వం శాఖల్లో అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలంటే ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
ప్రధాని మోదీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో వెల్లడించారు. సామాజిక న్యాయంపై మోదీ సర్కారు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ అంశాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
“రాజ్యాంగం ప్రకారం సమానత్వం, సామాజిక న్యాయం సూత్రాలకు అనుగుణంగా నియామకాలు ఉండాలి. లేటరల్ ఎంట్రీలో నియమాకాల్లో నిబంధనలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ప్రధాన మంత్రి మోదీ సామాజిక భద్రతపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ అంశాన్ని సమీక్షించి, సంస్కరించాల్సిన అవసరం ఉంది. అందువల్ల 17.8.2024న జారీ చేసిన లేటరల్ ఎంట్రీ రిక్రూట్మెంట్ ప్రకటనను రద్దు చేయాలని యూపీఎస్సీని కోరుతున్నాం” కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తన లేఖలో పేర్కొన్నారు.
లేటరల్ ఎంట్రీ విధానాన్ని 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కోసం వీరప్ప మొయిలీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు ఈ విధానాన్ని గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా వివిధ రంగాల నిపుణులకు ప్రభుత్వంలో ఆయా విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో భర్తీ చేయాల్సిన పదవుల్లో ఆయా రంగాల నిపుణులకు అవకాశం కల్పిస్తారు. వీరిని యూపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
అయితే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ పెద్దఎత్తున నియామకాలు చేయాలని ప్రయత్నించింది. ఈ విధానాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మోదీ ప్రభుత్వం రిజర్వేషన్ల విధానానికి మంగళం పాడుతూ బ్యాక్ డోర్ ద్వారా నియామకాలు చేస్తోందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలతోపాటు అధికారపక్షంలోని పార్టీల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి వచ్చింది. దీంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ విధానం రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు