కర్ణాటక కాంగ్రెస్ లో మరో కుంభకోణం ‘108 ఆరోగ్య కవచ్‌’

కర్ణాటక కాంగ్రెస్ లో మరో కుంభకోణం ‘108 ఆరోగ్య కవచ్‌’
ముడా, వాల్మీకి, వక్ఫ్‌బోర్డ్‌ స్కామ్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటక లోని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాజాగా ‘108 ఆరోగ్య కవచ్‌’ ఆంబులెన్స్‌ సేవల్లో జరుగుతున్న అక్రమాలు కుదిపివేస్తున్నాయి. ‘108 ఆరోగ్య కవచ్‌’ స్కామ్‌గా పిలుస్తున్న ఈ అక్రమాలకు కారణమైన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పెద్దయెత్తున డిమాండ్లు వస్తున్నాయి.

రోగులను కొంతదూరం ఒక అంబులెన్స్‌లో, ఆ తర్వాత మరో అంబులెన్స్‌లో, అనంతరం ఇంకో అంబులెన్స్‌లో తరలిస్తున్న ఘటనలు రాష్ట్రంలో ఇటీవల పెద్దయెత్తున వెలుగులోకి వచ్చాయి. ఎక్కువ బిల్లులు రాబట్టడం కోసమే ఇలా చేస్తున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చిత్రదుర్గకు చెందిన సయ్యద్‌ ఇఫ్తిఖార్‌కు గత నెల 19న గుండెపోటు వచ్చింది. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని జయదేవ దవాఖానకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో సయ్యద్‌ సోదరుడు ముంతాజ్‌ 108 సర్వీసుకు ఫోన్‌ చేశాడు. 

గంట తర్వాత వచ్చిన అంబులెన్స్‌ డ్రైవర్‌ ఇఫ్తిఖార్‌ను ఎక్కించుకొని 20 కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్లి అక్కడే రోడ్డుపై నిలిపేశాడు. అదేమిటని ప్రశ్నిస్తే, `మా కంపెనీ నిబంధనలు ఇంతే.. ఇంకో అంబులెన్స్‌ వచ్చేవరకూ వేచి ఉండండి’ అని బదులిచ్చాడు. అలా ఆరు గంటల్లో ఆరు ఆంబులెన్స్‌లను మార్చారు. చివరకు దవాఖానలో చేరిన ఇఫ్తిఖార్‌ పరిస్థితి అత్యంత విషమంగా తయారైంది.

దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో అసలు విషయం బయటపడింది. ఆగస్టు 5న కూడా ఓ గర్భిణికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఆమె పురిట్లోనే బిడ్డను కోల్పోయింది.  ఆంబులెన్స్‌ల మార్పుతో ఎక్కువ మంది రోగులకు సేవలు అందించామని చూపించి, ఎక్కువ బిల్లులు వసూలు చేయడానికే ఇలా చేస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు.

108 సేవలను అందిస్తున్న ఈఎంఆర్‌ఐ గ్రీన్‌ హెల్త్‌ సర్వీసులో పనిచేస్తున్న కొందరు అక్రమార్కుల వల్లే ఇదంతా జరుగుతున్నట్టు మండిపడుతున్నారు.  ఈ విషయం తమ దృష్టికి వచ్చిందన్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండురావు త్వరలోనే కొత్త టెండర్లను ఆహ్వానిస్తామని చెప్పారు. అయితే, ఈ స్కామ్‌లో ప్రభుత్వ పెద్దల పాత్ర కూడా ఉండొచ్చన్న ఆరోపణలు వస్తున్నాయి.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఈ విధంగా పలు అంబులెన్స్ లలో మార్చుతూ ఉండటం ద్వారా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ట్లు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమస్యపై ఆ కంపెనీ అంబులెన్స్ ల పనితీరుపై ఆడిట్ నివేదిక కోరుతున్నట్లు ఆరోగ్య కమిషనర్ డి రణదీప్ తెలిపారు.