ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాకాండలో దాదాపు 650 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయంలో ఓ నివేదిక పేర్కొంది. జ్యుడీషియల్ కస్టడీలో హింసా, అరెస్టులు, మరణాలకు సంబంధించిన ఘటనలపై పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలని పేర్కొంది. ఈ మేరకు హింసపై పది పేజీల నివేదికను సిద్ధం చేసింది.
నివేదిక ప్రకారం.. జూలై 16 నుంచి ఆగస్టు 4 మధ్య జరిగిన హింసలో 400 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఈ నెల 5-6 మధ్య జరిగిన హింసలో 250 మంది దుర్మరణం చెందారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. మీడియా నివేదికలు, పలు సంస్థలు జూలై నుంచి ఆగస్టు వరకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన హింసల్లో 600 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా పేర్కొన్నాయని నివేదిక తెలిపింది.
నివేదిక ప్రకారం మృతుల్లో నిరసనకారులతో పాటు పాత్రికేయులు, వివిధ దళాల భద్రతా సిబ్బంది సైతం ఉన్నారు. హింసాకాండలో వేలాది మంది గాయపడ్డారు. కర్ఫ్యూ నేపథ్యంలో సమాచారాన్ని సేకరించేందుకు వారు సైతం ఇబ్బందులుపడ్డారని, ఇంకా మరణాలు సైతం ఎక్కువగా ఉండవచ్చని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవానికి బంగ్లాదేశ్‌లో జూన్‌లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు ఇచ్చిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి.
అయితే, నిరసన సమయంలో భద్రతా బలగాలు సైతం మానవ హక్కులను ఉల్లంఘించినట్లు ఆరోపణలున్నాయి. ఆందోళనకారుల పట్ల భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరించాయని.. దాంతోనే పరిస్థితి మరింత దిగజారిందని నివేదిక తెలిపింది. మైనారిటీలపై దోపిడీలు, విధ్వంసం, ఆస్తులకు నిప్పుపెట్టడం ఘటనలు సైతం జరిగాయని నివేదిక చెప్పింది.
ఈ నెల 15న బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు తరలివచ్చిన అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులపై వెదురు కర్రలు, ఇనుప రాడ్లు, పైపులు వంటి వాటితో సాయుధ గుంపు దాడికి దిగినట్లు తెలిపింది, శాంతిభద్రతలను వేగంగా పునరుద్ధరించడం, ప్రాణనష్టం, ప్రతీకార దాడులను నివారించడానికి బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరింది.

More Stories
హసీనాకు మరణశిక్షను నిరసిస్తూ ఆందోళనలు
బంగ్లాదేశ్‌లో అంతర్యుద్ధం కోరుకుంటున్న యూనుస్
షేక్ హసీనాకు బంగ్లా కోర్టు ఉరిశిక్ష