తుంగభద్ర 19వ గేటుకు స్టాప్‌లాగ్‌ను అమర్చిన ఇంజినీర్లు

తుంగభద్ర 19వ గేటుకు స్టాప్‌లాగ్‌ను అమర్చిన ఇంజినీర్లు

ఎట్టకేలకు తుంగభద్ర జలాశయంలో ఇంజినీరింగ్ అద్భుతం జరిగింది. డ్యాం గేటు కొట్టుకుపోయి ప్రవాహం ఉండగానే, స్టాప్‌లాగ్ గేటు అమర్చిన ఘనత ఇంజినీర్లకు దక్కింది. మూడు రాష్ట్రాల ఉమ్మడి జలాశయంగా ఉన్న తుంగభద్ర డ్యాంలో ఈనెల 10న ప్రవాహంలో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో భారీ వరద ఉండగానే స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేశారు.  దానితో 70 టీఎంసీల నీటిని సముద్రంపాలు కాకుండా కాపాడగలిగారు. 

5 ఎలిమెంట్లూ అమర్చడంలో ఇంజినీర్లు విజయవంతమయ్యారు. నాలుగు అడుగుల ఎత్తు ఉన్న ఒక్కో ఎలిమెంటును అత్యంత సాహసంతో అమర్చి వృథాగా పోతున్న నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. ఐదు ఎలిమెంట్ల ఏర్పాటుతో జలాశయం పూర్తిగా నిండినా, 19వ గేటు నుంచి నీరు దిగువకు వెళ్లే మార్గం లేకుండా ఈ స్టాప్ లాగ్ గేటు ప్రవాహాన్ని అడ్డుకోనుంది.

జలాశయ గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో అత్యంత సాహసంతో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటును పూర్తి చేశారు. ఇది ఇంజినీరింగ్ అద్భుతంగా నిపుణులు చెబుతున్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ 60×4 మొదటి బిట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసిన నిపుణుల శ్రమ ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు. చరిత్రలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేసిన ప్రక్రియ ఇది మొదటిసారని తెలిపారు.

తుంగభద్ర గేటు మరమ్మతులను విజయవంతంగా పూర్తి చేసే నిపుణుల రిస్క్ టీంకు సారధ్యం వహించేలా అత్యంత నిపుణత కలిగిన కన్నమ నాయుడుకు బాధ్యతలు అప్పగించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుకు నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు.

మూడు రోజుల క్రితమే తుంగభద్ర జలాశయంలో తుంగభద్ర జలాశయంలో గల్లంతైన గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటుకు పనులు మొదలయ్యాయి. తుంగభద్ర 19వ నెంబర్ గేట్‌ వద్ద డ్యామ్ వద్ద అధికారులు పూజలు చేసి పనులను మొదలుపెట్టారు. కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో జలాశయ అధికారులు కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్ లాగ్‌ గేటును అమర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

తుంగభద్ర జలాశయంలోకి శనివారం రాత్రికి ఎగు వనుంచి 84వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. డ్యామ్‌ లో నీటినిల్వ 72 టీఎంసీలు దాటాయి. వారం రోజుల్లో జలాశయం నీటి నిల్వలు 105.78 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనావేశారు.