ప్రతి రెండు గంటలకు శాంతి భద్రతలపై కేంద్రానికి నివేదిక

ప్రతి రెండు గంటలకు శాంతి భద్రతలపై కేంద్రానికి నివేదిక
కోల్‌కతా ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాలలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం ఘటనను తీవ్రంగా నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్య సంఘాలతో పాటు పలువురు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.  ప్రతి రెండు గంటలకు ఒకసారి శాంతిభద్రతలపై నివేదికను సమర్పించాలని అన్ని రాష్ట్రాలకు సూచిస్తూ కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. అన్ని రాష్ట్రాల పోలీస్ విభాగాలు ఈ-మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలను పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
‘ప్రతి రెండు గంటలకు శాంతిభద్రతలపై నివేదిక పంపాలి… పశ్చిమ్ బెంగాల్‌లోని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రెయినీ డాక్టర్ హత్యకు నిరసనగా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో శాంతిభద్రతల నివేదికను పర్యవేక్షించాలి.. ఈ విషయంలో నిరంతర రెండు గంటలకు ఒకసారి శాంతిభద్రతల నివేదికను ఫ్యాక్స్, ఈ-మెయిల్,వాట్సాప్ ద్వారా కేంద్ర హోం శాఖ కంట్రోల్ రూమ్‌కి పంపాలి’ అని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను కేంద్రం ఆగస్టు 16నే వెలువరించింది.
 
ఈ ఉత్తర్వులపై ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘కీలకమైన సమస్యలకు సంబంధించిన నివేదికలు సకాలంలో అందేలా ఇది నిర్ధారిస్తుంది. కోల్‌కతా హత్యాచార ఘటనలో పలు లోపాలు గమనించాం.. ఇటువంటి కీలక కేసుల్లో త్వరితగతిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై నిఘా ఉంచడానికి ఈ కీలకమైన చర్య తీసుకున్నట్టు కేంద్ర హోంశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. 
 
వైద్యురాలిపై హత్యాచార ఘటనలో పలు వైఫల్యాలు, సంబంధిత అధికారుల నుంచి సరైన మద్దతు లభించకపోవడం ఆందోళనలకు కారణమయ్యింది. స్థానిక పోలీసుల దర్యాప్తు నతనడకన సాగడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలకత్తా హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది