
డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది భద్రతకు తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. సంబంధిత నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను కమిటీకి తెలపవచ్చునని వెల్లడించింది.
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఆర్జీ కర్ వైద్యకళాశాల, ఆస్పత్రిపై 40మంది దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసులను, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఆందోళనలు విరమించి విధుల్లో చేరాల్సిందిగా దేశవ్యాప్తంగా డాక్టర్లకు విజ్ఞప్తి చేసింది.
మరోవంక, ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) అధ్యక్షుడు ఆర్‌వి అశోకన్ కోరారు. దీనిపై ప్రధానికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. కేంద్ర ఆరోగ్య మంత్రిని ఇప్పటికే కలిశామని, ఇక స్పందించాల్సి ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ప్రాధమిక హక్కు అయిన జీవించే హక్కుకు రక్షణ కల్పించాలని మాత్రమే కోరుతున్నామని, కానీ స్పందించడానికి రాజకీయ సంకల్పం వుండాలని తెలిపారు.
హత్యాచార ఘటన, ఆస్పత్రిపై దాడికి నిరసనగా భారత వైద్య మండలి (ఐఎంఏ) పిలుపు మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ‘నాన్ ఎమర్జెన్సీ’ సర్వీసులు నిలిచిపోయాయి. ఫలితంగా ఓపీలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులుపడ్డారు. కాగా వైద్యుల భద్రతకు సంబంధించి ఐఎంఎ ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లను ఉంచింది. ప్రధానంగా రెసిడెన్షియల్ వైద్యుల పని, జీవన పరిస్థితులను సమూలంగా మార్చేయాలని, పని ప్రదేశంలో వైద్య సిబ్బందిపై హింస జరగకుండా నివారించేందుకు కేంద్ర చట్టాన్ని తీసుకురావాలని కోరింది.
ఎపిడమిక్ డిసీస్ యాక్ట్ 1897ను అనుసరించి 2019లో హాస్పిటల్ ప్రొటెక్షన్ బిల్లులో 2023లో పొందుపర్చిన సవరణలను అమలు చేయాలని, అప్పుడు వైద్యుల భద్రత పటిష్టం అవుతుందని ఐఎంఏ అంటోంది. ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురై న వైద్యురాలు అప్పటికీ వరుసగా 36 గంటలపాటు విధుల్లో ఉండటం, విశ్రాంతి తీసుకునేందుకు సరైన ఏర్పాట్లేవీ లేకపోవడం.. ఫలితంగానే ఆమె పట్ల ఘోరం జరిగిందని ఓ వైద్యుడు పేర్కొన్నారు.
ఏ వైద్యుడైనా 8 గంటలు లేదా 12 గంటల వరకు నిర్విరామంగా పనిచేయగలరు. కానీ.. 36 గంటలపాటు ఎలా పనిచేయగలరు? ఈ స్థాయి పని ఒత్తిళ్లు అటు వైద్యులకు గానీ.. రోగులకు గానీ మంచిది కాదు అని చెప్పారు. దేశవ్యాప్తంగా శనివారం ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు తదితర రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. పరిస్థితులను చక్కదిద్దడంలో విఫలమైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని నిర్భయ తల్లి డిమాండ్ చేశారు.
బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ బ్రిటన్‌లోని భారత డాక్టర్లు బహిరంగ లేఖ రాశారు. చర్యలు తీసుకోని బెంగాల్ ప్రభుత్వ వైఖరిని ఖండించారు. లండన్‌లోని ఇండియా హౌస్ వెలుపల శాంతియుతంగా నిరసన చేపట్టారు. ఎడిన్‌బరోతో సహా పలు నగరాల్లో సంఘీభావ కార్యాచరణ చేపట్టారు. బంగ్లాదేశ్‌లో విద్యార్ధులు భారత విద్యార్ధులకు సంఘీభావంగా ప్రదర్శనలు చేశారు.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్లో చీలిక!
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్